డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ ధర్నా | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ ధర్నా

Published Fri, Nov 22 2024 2:01 AM | Last Updated on Fri, Nov 22 2024 2:01 AM

డీఎస్

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ ధర్నా

అవనిగడ్డ: ప్రభుత్వం వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం కృష్ణాజిల్లా అవనిగడ్డలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు డీఎస్పీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. నవంబర్‌ మూడో తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నట్టు చెప్పిన ప్రభుత్వం తరువాత ఆరోతేదీ అని చెప్పి, చివరికి నోటిఫికేషన్‌ను వాయిదా వేసి నిరుద్యోగులను వంచనకు గురి చేసిందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం అంటూ హడావుడి చేసిన చంద్రబాబు ఇంతవరకూ నోటిఫికేషన్‌ ఎందుకు ప్రకటించలేదని విమర్శించారు. టెట్‌ తరువాత మూడు నెలల కాల పరిమితి ఉండాలనే సాకుతో కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌కు కాలయాపన చేస్తోందన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించగా, ఆ పోస్టులను కూడా కలుపుకుని 16,347 పోస్టుల్ని ప్రకటించి ఐదు నెలలు అవుతున్నా ఇంతవరకూ తేదీలు ఇవ్వకుండా నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేస్తోందన్నారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రస్తావనే లేకపోవడం చూస్తుంటే, డీఎస్సీ అంశంపై కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ని విడుదల చేయాలని రవిచంద్ర డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం నాయకులు ఐ.శ్రీనివాస్‌, కె.శివారెడ్డితోపాటు డీఎస్సీ అభ్యర్ధులు పాల్గొన్నారు.

చురుగ్గా డ్రోన్‌

ఆపరేటింగ్‌ శిక్షణ

విజయవాడస్పోర్ట్స్‌: కమాండ్‌ కంట్రోల్‌ రూం వద్ద మహిళా పోలీసులకు ఇస్తున్న డ్రోన్‌ ఆపరేటింగ్‌ శిక్షణ చురుగ్గా సాగుతున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు తెలిపారు. శిక్షణ జరుగుతున్న తీరును డీసీపీ గౌతమి సాలి, సీఐ హనీష్‌తో కలిసి కమిషనర్‌ గురువారం పరిశీలించారు. జిల్లాలోని 75 మంది మహిళా పోలీసులకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆపరేటింగ్‌లో నిష్ణాతులై నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని మహిళా పోలీసులకు సూచించారు.

గురుకుల పాఠశాల తనిఖీ

జగ్గయ్యపేట అర్బన్‌: పట్టణంలోని సత్యనారాయణపురంలో ఉన్న ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలను డ్వామా పీడీ, జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జ్‌ అధికారి ఎ.రాము గురువారం తనిఖీ చేశారు. గురుకులంలో విద్యార్థులకు అందించే ఆహారపదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ప్రిన్సిపాల్‌, వార్డెన్‌లకు సూచించారు.

నేటి నుంచి హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయవాడ మేరీస్‌ స్టెల్లా ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం నుంచి లేపాక్షి గాంధీ శిల్ప్‌ బజార్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ, ఎండీ ఎం.విశ్వ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీ శిల్పబజార్‌లో డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ ప్రదర్శనను రాష్ట్రమంత్రులు ఎస్‌.సవిత, సత్యకుమార్‌ యాదవ్‌ ప్రారంభిస్తారన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 100మంది హస్తకళాకారులు తమ కళానైపుణ్యంతో తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతారన్నారు. టెక్స్‌టైల్స్‌, ఎంబ్రాయిడరీ, గ్రాస్‌ లీఫ్‌, ఇమిటేషన్‌ జువెలరీ, కార్పెట్స్‌, లెదర్‌ ఆర్టికల్స్‌, హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింటింగ్‌, టై అండ్‌ డై చీరలు, ఉడ్‌ కార్వింగ్‌, లేస్‌ బ్యాగులు, డ్రెస్‌ మెటీరియల్స్‌, కొండపల్లి బొమ్మలు, బాటిక్‌ ప్రింట్స్‌ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని విశ్వ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డీఎస్సీ నోటిఫికేషన్‌  ఇవ్వాలంటూ ధర్నా 
1
1/1

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ ధర్నా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement