బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈనెల 15వ తేదీన స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అవమానించే రీతిలో కొందరు చేసిన వ్యాఖ్యలు, కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను బీసీ సంఘాలు, బీసీ కులాల ప్రతినిధుల రౌండ్‌టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. గౌతు లచ్చన్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ నేతలను ఉద్దేశించి ‘ఇంగిత జ్ఞానం లేదా?’ అంటూ ఓ పత్రిక రాసిన కథనాన్ని తప్పుపట్టింది. ఇందుకు నిరసనగా ఈ నెల 29వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాలకు క్షీరాభిషేకం చేయాలని సమావేశం తీర్మానించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన బీసీ సంఘాలు, బీసీ కులాల ప్రతినిధులు రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రముఖ న్యాయవాది యంగల కోటేశ్వరరావు (వైకే) మాట్లాడుతూ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడమే నేరమన్నట్లు కొందరు దురఅహంకారపూరిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆధిపత్య కుల శక్తులు బీసీ సామాజిక వర్గాల ఆత్మగౌరవం దెబ్బతీశాయని, ఈ చర్యలను సహించబోమని హెచ్చరించారు. బీసీల ఆత్మగౌరవ పోరాటాన్ని ఉధృతం చేయాలని సమావేశం తీర్మానించినట్లు చెప్పారు. సమావేశంలో బీసీ సంఘాల ప్రతినిధులు చంద్రరావు, బి.సి.రమణ, వీరవల్లి శ్రీనివాస్, సైకం రాజశేఖర్, నమ్మి అప్పారావు, ఎన్వీరావు, పి.వి.రమేష్, మరీదు శివరామకృష్ణ, చంద్రమౌళి, మురళీ, పామర్తి జయప్రకాష్, అక్కా శ్రీనివాస్, మొగిలి కృష్ణ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంఘాల ప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment