4న దక్షిణ భారత జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నూతన ఆవిష్క రణలు దేశ ప్రగతికి సోపానాలని, విద్యార్థుల వైజ్ఞానిక ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్ మంచి వేదిక అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి దక్షిణ భారత ఎన్టీఆర్ జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్–2025 పోస్టర్లను కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సైన్స్ ఫెయిర్ జనవరి నాలుగో తేదీన అజిత్‌సింగ్‌నగర్ లోని ఎంకే బేగ్ మునిసిపల్ కార్పొరేషన్ హై స్కూల్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి మండలం నుంచి ఆరు ప్రాజెక్టులు పోటీల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు. టీచర్ ఎగ్జిబిట్, వ్యక్తిగత, గ్రూప్ కేటగిరీల్లో దాదాపు 120 ప్రాజెక్టుల ప్రదర్శనలు ఉంటాయని, విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త ఆవిష్కరణలతో ప్రాజెక్టులను ఎంపిక చేసుకొని జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యేలా కృషిచేయాలని సూచించారు. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం (వీఐటీఎం) సహకారంతో సమగ్రశిక్ష ఎస్‌పీడీ, ఎస్‌ఈఆర్‌టీ మార్గదర్శకాల మేరకు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, గణితం, ఎర్త్/స్పేస్ సైన్స్, పర్యావరణ శాస్త్రం, ఇంజినీరింగ్, బయోసైన్స్/బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ప్రాజెక్టులు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ మైనం హుస్సేన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment