మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
తిరువూరు: ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైన కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ మత రాజకీయాలతో కాలక్షేపం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం తిరువూరులో ఎన్టీఆర్ జిల్లా సీపీఎం మహాసభల ప్రారంభ సందర్భంగా ప్రదర్శన జరిపిన అనంతరం ఫ్యాక్టరీ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను పార్లమెంట్‌లో అవమానించిన కేంద్రమంత్రి అమిత్‌షాపై బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోవడం విచారకరమన్నారు. సామాజిక అసమానతలను సృష్టిస్తూ దేశంలోని రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతూ గత పదిన్నరేళ్లుగా అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని శ్రీనివాసరావు ఆరోపించారు. హిందూ, ముస్లిం మతాల నడుమ చిచ్చు పెట్టే రీతిలో పాలన సాగిస్తున్న బీజేపీకి రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. భారతదేశం పెట్టుబడిదారులు, బూర్జువా పార్టీల పాలనతో పూర్తిగా వెనుకబడిపోయిందని, మనకంటే చిన్నదేశాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా దూసుకుపోతున్నాయన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ, రాష్ట్ర, జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాథ్, మేకల నాగేంద్రప్రసాద్, ఎన్‌సీహెచ్ శ్రీనివాస్, ఎస్. నాగేశ్వరరెడ్డి, చిగురుపాటి బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీ సెంటర్ నుంచి బోస్ సెంటర్, చీరాల సెంటర్, సినిమాహాల్స్ సెంటర్ల మీదుగా జరిగిన ప్రదర్శనలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment