రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం మంజూరు
విజయవాడస్పోర్ట్స్: గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం పరిహారం అందజేస్తోందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు. జిల్లాకు చెందిన 15 మంది బాధితులకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10.50 లక్షల చెక్కులను పోలీస్ కమిషనర్ కమిషనరేట్‌లో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.లక్ష, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.50 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోందన్నారు. 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈనెల మూడో తేదీ వరకు జిల్లాలో 221 రోడ్డు ప్రమాద (హిట్ – రన్) కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీని కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఇప్పటి వరకు 120 కేసులకు సంబంధించిన ఫారాలను కలెక్టరేట్‌కు పంపిందని, వాటిల్లో జనరల్ ఇన్సూరెన్స్ అధికారులకు 30 వెళ్లాయని, వీటిల్లో 15 మంది బాధితులకు రూ. 10.50 లక్షలను మృతుల కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. నష్ట పరిహారం రావడంలో కీలకంగా వ్యవహరించిన డీసీపీ కష్ణమూర్తినాయుడు, డెప్యూటీ కలెక్టర్ జి. మహేశ్వర రావు, జనరల్ ఇన్సూరెన్స్ అధికారి డి.రామ్ సుధాకర్, ఏసీపీ పి. రామచంద్రరావు, ఎస్‌ఐ మల్లీశ్వరి, డెప్యూటీ తహసీల్దార్ ఎస్.నాగజ్యోతిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment