ప్రాథమికోన్నత పాఠశాలలపై సర్కారు పగ!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పేదలు చదువుకునే పాఠశాలలపై కూటమి సర్కార్ కన్నెర్ర చేస్తోంది. పేద విద్యార్థులపై ఖర్చు చేసే ప్రతి పైసా భారంగా పరిగణిస్తోంది. దాంతో పేదల బడులను క్రమంగా తగ్గించి, వారికి విద్యను దూరం చేసే కుట్ర చేస్తోంది. సంస్కరణల పేరుతో ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసే దారుణానికి తెరలేపింది. వివిధ కారణాలను చూపుతూ ఆ పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలల పేరుతో దిగజార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ తాజా నిర్ణయాలను అమలు చేయనుంది.
యూపీ స్కూల్స్ ఇక ఉండవ్..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్న విద్యార్థులు 60 మంది కంటే అధికంగా ఉంటే ఆ విద్యాసంస్థను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ విద్యార్థులు అధికంగా ఉన్నప్పటికీ వసతులు లేమి చూపుతూ ప్రాథమిక పాఠశాలగా డీగ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో అత్యధిక పాఠశాలల్లో 50 నుంచి 80 మధ్య విద్యార్థుల సంఖ్య ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. రానున్న విద్యాసంవత్సరం ప్రారంభం (2025–2026) నాటికి ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఒక్క ప్రాథమికోన్నత పాఠశాల లేకుండా చర్యలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 282 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు వివిధ యాజమాన్యాల పరిధిలో కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని మండలాల్లో 128 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. అందులో సుమారుగా పది వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అలాగే కృష్ణాజిల్లాలో 154 ప్రాథమికోన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 12 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
దూరాభారం..
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉన్నత విద్య దూరాభారంగా మారే ప్రమాదముందని పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఐదారు కిలోమీటర్ల కన్నా దూరం ఉన్న క్రమంలో ఆ విద్యార్థులు బడి మానేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతోనే ఈ విధమైన చర్యలను సంస్కరణల పేరుతో అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంస్కరణల అమలుకు వర్క్‌షాప్
ప్రభుత్వం అమలు చేసే సంస్కరణలపై రెండు రోజుల క్రితం విద్యాశాఖ జోనల్ స్థాయి వర్క్‌షాప్‌ను విజయవాడలో నిర్వహించింది. అందులో రానున్న కాలంలో ప్రాథమికోన్నత పాఠశాలలను పూర్తిగా తీసివేయాలనే లక్ష్యాన్ని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు సుచాయగా వివరించినట్లు సమాచారం. సంఖ్య తక్కువ, వసతుల లేమి పేరుతో వాటిని తీసివేసే విధంగా పలు నిబంధనలను వివరించి వాటిపై అవగాహన కల్పించినట్లు తెలిసింది. అంతేకాకుండా హైస్కూల్స్ ఏర్పాటు చేయటానికి సైతం కొన్ని మార్గదర్శకాలు వివరించారని సమాచారం. అయితే ఈ మార్గదర్శకాలు అమలులో అవరోధాలు చూపించి, ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రైమరీ స్కూల్స్‌గా మార్పు చేసేందుకు సులువైన నిబంధనలను తయారు చేసినట్లు కొంతమంది అధికారులు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment