హెచ్‌ఐవీ బాధితుల్లో మనోధైర్యం నింపాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. హెచ్‌ఐవీ బాధితుల్లో వైద్య సిబ్బంది మనోదైర్యాన్ని నింపాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.3.60కోట్లతో కొనుగోలు చేసిన 10 ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్, టెస్టింగ్ వెహికల్స్‌ను శుక్రవారం ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ మొబైల్ వ్యాన్‌లో వైద్య పరీక్షలకు అవసరమైన పరికరాలతో పాటు, ల్యాబ్ టెక్నీషియన్, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వాహనాలు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో దాదాపు 25 లక్షల హెచ్‌ఐవీ కేసులు ఉన్నాయని, రాష్ట్రంలో 2.22 లక్షల మంది వ్యాధి బారిన పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎ. సిరి, కలెక్టర్ జి. లక్ష్మీశ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె. పద్మావతి, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఏపీ శాక్స్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సర్వసతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ జె.ఉషారాణి, సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. అశోక్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏ. వెంకటేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment