మృతురాలు అనూష
పాలకొండ: నగపంచాయతీలోని గారమ్మకాలనీలో నివాసం ఉంటున్న కూనబిల్లి అనూష(21) సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటనపై ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనూషకు గడిచిన మే నెలలో వివాహం జరిగింది. ఆషాడం మాసంలో పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. సోమవారం తండ్రి దుర్గారావు కూలి పనికి వెల్ల, తల్లి మార్కెట్‌కు వెళ్లారు. తల్లి మార్కెట్ నుంచి తిరిగి ఇంటికి వచ్చే సమయానికి కుమార్తె ఉరివేసుకున్నట్లు తల్లి ఫిర్యాదులో మృతురాలి తల్లి పేర్కొంది. ఈ మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించామని, మంగళవారం రిపోర్టు వస్తుందని ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
చెట్టుపై నుంచి
జారిపడి యువకుడు..
భోగాపురం: భోగాపురం పంచాయతీ కొయ్యపేట గ్రామంలో చెట్టుపై నుంచి జారిపడి సోమవారం ఓ యువకుడు మృతిచెందాడు. భోగాపురం పంచాయతీ కొయ్యపేట గ్రామానికి చెందిన బాకి కనకరావు(32) పూల వ్యాపారం చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని యాజమానుల పూలతోటల వద్దకు వెళ్లి పూలు కొనుగోలు చేసి వాటిని విశాఖపట్నం జిల్లా అనంతపురం గ్రామానికి తీసుకువెళ్లి అధిక ధరకు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒక యాజమాని తోటలో ఉన్న సంపంగి చెట్టు ఎక్కి పూలు కోస్తూ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి కిందకు పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య సూరమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎసై కృష్ణమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment