నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
● కనీస మద్దతు ధర రూ.2,300
● సాగు పెట్టుబడి ప్రోత్సాహం రూ.800
● డిప్యూటీ సీఎం కనక వర్ధన్ సింగ్ దేవ్ ప్రకటన
భువనేశ్వర్: రాష్ట్రంలోని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని డిప్యూటీ సీఎం, వ్యవసాయం, రైతు సాధికారిత విభాగం మంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ తెలిపారు. ఈసారి ధాన్యం విక్రయించే రైతులకు కనీస మద్దతు ధర రూ.2,300 లతో అదనంగా సాగు పెట్టుబడి ప్రోత్సాహం కింద రూ.800లు లభిస్తాయి. ఈ మొత్తం విడుదల డిసెంబర్ 8వ తేదీ నుంచి ఆరంభం అవుతుంది. రైతుల పొదుపు ఖాతాకు ప్రత్యక్షంగా ఈ సొమ్ము బదిలీ అవుతుందని మంత్రి స్పష్టం చేశారు.
పారదర్శకంగా
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు తొలిసారిగా రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోంది. పూర్తి విభిన్నంగా రైతులకు అనుకూలంగా ఉండే రీతిలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సమగ్ర ప్రక్రియ అత్యంత సరళంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేశారు. విక్రయానికి సిద్ధం చేసిన ధాన్యం నాణ్యత పరిశీలన కోసం ప్రత్యేక ధాన్య నాణ్యత విశ్లేషకులను నియమించారు. వరి సేకరణ, కొనుగోళ్లు మండీ ప్రాంగణాల్లో ఈ యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. వరి సాగు పుష్కలంగా ఉండి అధికంగా విక్రయించే ప్రాంగణాల్లో ఈ నిపుణుల బృందాలను నియమించారు. కొన్ని ప్రాంతాలు మినహా అత్యధిక ప్రాంతాల్లో ధాన్యం నాణ్యత విశ్లేషకులు అందుబాటులో ఉంటారని మంత్రి వివరించారు.
సందేహాల నివృత్తికి
ధాన్యం విక్రయాలు పురస్కరించుకుని రైతాంగం సందేహాల నివృత్తికి సమగ్ర నియమావళి అందుబాటులో ఉంటుంది. వరి నాణ్యత (తేమ వంటి అంశాలు) విశ్లేషణ పారదర్శకంగా ప్రదర్శితం అవుతుంది. ఒక్కో రైతు వరి విక్రయం పురస్కరించుకుని 2 చొప్పున టోకెన్లు జారీ చేస్తారు. వీటిలో ఒకటి రైతు దగ్గర, మరొకటి ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీని ఆధారంగా వరి విక్రయం లావాదేవీల సమగ్ర సమాచారం పారదర్శంగా నిర్వహించడం జరుగుతుందని మంత్రి వివరించారు. ఈ లెక్కన ఈ ఏడాది వరి విక్రయం అత్యంత సరళీకర వ్యవస్థ ఆధ్వర్యంలో పారదర్శకంగా విజయవంతం కాగలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment