అరకొరగా హోమియో మందులు
● తప్పక బయట షాపుల్లో కొనుగోలు
● వదులుతున్న చేతిచమురు
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన డి.అప్పలసత్యం రెండు రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలకు చర్మ సంబంధిత వ్యాధితో వెళ్లాడు. పరీక్షించిన హోమియో వైద్యుడు మూడు రకాల మందులు రాశారు. ఆ చీటీ పట్టుకుని ఆస్పత్రిలోని హోమియో ఫార్మశీ వద్దకు వెళ్లగా అక్కడ ఒక రకం మందు మాత్రమే ఇచ్చారు. రెండు రకాల మందులు లేవని, బయట కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. దీంతో చేసేది లేక ప్రైవేట్ హోమియో మందుల దుకాణంలో రూ. 200 పెట్టి కొనుగోలు చేశాడు. ఇదే మండలానికి చెందిన సీహెచ్.ఈశ్వరమ్మ మెడ, నడుం నొప్పితో మూడు రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ప్రభుత్వ హోమియో వైద్యశాలకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నాలుగు రకాల మందులు రాశారు. ఆ చీటీ పట్టుకు హోమియో ఫార్మశీ వద్దకు వెళ్లగా ఒక రకం మందు మాత్రమే ఇచ్చారు. మూడు రకాల మందులు లేవు. బయట కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. దీంతో చేసేది లేక రూ.400 పెట్టి ఆమె బయట కొనుగోలు చేసింది.
ఇది వీరిద్దరికే కాదు. అనేక మందికి ఎదురవుతున్న పరిస్థితి. హోమియో వైద్యశాలకు వెళ్లిన అధికశాతం మంది బయట మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ హోమియో వైద్యశాలకు వచ్చేది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యంతో పాటు, మందులు ఉచితంగా అందించాల్సి ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన రోగులకు మందుల కోసం డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి.
హోమియో వైద్యశాలకు 40నుంచి 50 మంది రోగులు
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలకు రోజుకు 40నుంచి 50 మంది వరకు రోగులు వస్తారు. చర్మ, బీపీ. షుగర్, సైనసైటిస్, రక్తహీనత, కీళ్లవాతం, గొంతునొప్పి, తదితర వ్యాధులకు సంబంధించిన రోగులు హోమియో వైద్యశాలకు వస్తారు.
వదులుతున్న చేతిచమురు
ప్రభుత్వ హోమియో వైద్యశాలలో మందులు పూర్తి స్థాయిలో లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ వైద్య శాలకు వెళ్లిన వారు తప్పక చేతిచమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. హోమియో వైద్యశాలలో మందులు లేక పోవడం వల్ల ప్రైవేట్ హోమియో మందుల దుకాణాల్లో ఒక్కో రోగి రూ. 400 నుంచి రూ. 500 వెచ్చిస్త మందులు కొనుగోలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment