ఏనుగు దాడి: ఒకరికి గాయాలు
రాయగడ: ఏనుగు దాడిలో ఒకరు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి మరిడిజోల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన జింబురు కుంభారికగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. కట్టెలను తీసుకువచ్చేందుకు సమీపంలోని అడవుల్లోకి కుంభారిక శుక్రవారం వెళ్లాడు. అదే సమయంలో ఏనుగు తారస పడటంతో భయంతో పరుగులు తీశాడు. అయితే అతనిని వెంబడించిన ఏనుగు అతనిపై దాడి చేసి కొంతదూరం విసిరేసింది. దీంతో గాయాలు పాలైన కుభారికి అచేతన స్థితిలో అక్కడే ఉండిపొయాడు. కుటుంబీకులు అతని రాకకై ఎదురు చూసినప్పటికీ రాత్రయినప్పటికీ రాకపోవడంతో ఆందోళన చెందారు. శనివారం తెల్లవారుజామున అడవిలోకి వెళ్లి గాలించారు. పాపిఖాల్ అడవుల్లో చెట్టు పొదల్లొ ఆపస్మారక స్థితిలో ఉన్న కుంభారికను చూసి కుటుంబ సభ్యులు వెంటనే అతనిని బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. ఏనుగు దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపొవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గాయపడిన కుంభారిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు ధ్రువీకరించారు. కొద్ది రోజులుగా ఆరు ఏనుగుల గుంపు ఈ అడవుల్లో తిరుగుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment