సామిత్వ యోజన ప్రారంభం
రాయగడ:
భూములపై సర్వహక్కులు కలిగించే సామిత్వ పథకం ఒడిశా రాష్ట్రంలో శనివారం ప్రారంభమైంది. రాయగడ, నవరంగపూర్, ఝార్సుగుడ, గజపతి, డెంఖానాల్ జిల్లాలో ఈ పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాయగడలోని బిజు పట్నాయక్ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి, రెవెన్యూ శాఖ మంత్రి సురేష్ పూజారిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాఝి మాట్లాడుతూ సామిత్వ యోజన ద్వారా అనేక సదుపాయాలు కలుగుతాయన్నారు. ఎంతోమంది నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు మంజూరైనా ఆయా భూములు ఎక్కడ ఉన్నాయో తెలియజేసే ఆధారిత పత్రాలు లేకపొవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటన్నింటికి సామిత్వ పథకం పరిష్కారం చూపుతుందని చెప్పారు.
డ్రోన్ ద్వారా సర్వే..
సామిత్వ యోజనను పకడ్బందీగా సమీక్షించాకే ఆచరణలోకి తీసుకువచ్చామని సీఎం మాఝి తెలిపారు. ప్రధాని మోదీ 2021లోనే కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేశారని, సత్ఫలితాలు ఇవ్వడంతో ఒడిశాలో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. దీనిలో భాగంగా తొలి విడతగా 5 జిల్లాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. సుమారు 3045 గ్రామాల్లో డ్రోన్ సర్వే జరిపామన్నారు. 242 మంది లబ్ధిదారులను గుర్తిం పథకం కింద ప్రాపర్టీ పట్టాలను అందజేశామని తెలిపారు.
దక్షిణ ఒడిశాపై కేంద్రం దృష్టి..
దక్షిణ ఒడిశాలో అంతర్భాగమైన రాయగడ పారిశ్రామికంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి మాఝి తెలిపారు. కొద్ది రొజుల క్రితం రాయగడ రైల్వే డివిజన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. జిల్లాలోని ఖనిజ ప్రాకృతిక సంపదలను సద్వినియోగం చేసుకుంటే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అనంతరం రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, బిసంకటక్ ఎమ్మెల్యే నీలనమాధవ హికక తదితరులు ప్రసంగించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సురేష్ పూజారి మాట్లాడుతూ హామీలను అమలు చేయడంలో బీజేపీ సర్కారు ముందుంటుందన్నారు. అంతకు ముందు గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానానికి హెలికాప్టర్ ద్వారా వచ్చిన ముఖ్యమంత్రికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్, కాళీరాం మాఝి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలొ పాల్గొని స్వాగతం పలికారు.
వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
భూములపై సర్వహక్కులు: సీఎం మాఝి
పలువురు లబ్ధిదారులకు ప్రాపర్టీ పట్టాలు ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment