కార్టూన్ల పాత్ర కీలకం
భువనేశ్వర్: బలమైన వ్యక్తిని కూడా బలహీనపరిచే ఆయుధం కార్టూన్ అని, చిత్రాల కంటే కార్టూన్లలో సంక్షిప్త వివరణ కీలకమని ప్రమేయ సంపాదకుడు గోపాల్ మహాపాత్రొ అన్నారు. ఒడిశా కార్టూన్ అకాడమీ 3వ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రముఖ కార్టూన్ కళాకారులు శనివారం స్థానిక జయదేవ్ భవన్‌లో సమావేశమయ్యారు. వర్ధమాన పరిస్థితుల్లో కార్టూన్ కళ వాస్తవ స్థితిగతుల్ని ప్రముఖుల సమక్షంలో విశ్లేషించారు. దిన, వార, మాస పత్రికలతో పలు మేగజైన్ల ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వార్తా ప్రసార రంగంలో అత్యధిక పాఠకుల్ని స్పందింపజేసే మాధ్యమం కార్టూన్ అని సంబాద్ సంపాదకురాలు తనయ పట్నాయక్ పేర్కొన్నారు. వార్తాపత్రికల్లో అగ్రస్థానం సాధించే కార్టూన్ల ఆవిష్కరణ పట్ల వర్ధమానతరం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రముఖ రచయిత, కాలమిస్ట్ మృణాల ఛటర్జీ మాట్లాడుతూ హాస్యం ఆధారిత కార్టూన్ల ప్రాధాన్యతని వివరించారు. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ పాత్రికేయుడు రూబెన్ బెనర్జీ మాట్లాడుతూ దేశంలో కార్టూనిస్టులపై హింసాత్మక దాడుల సంఘటనలు జరుగుతున్న తరుణంలో ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. అనంతరం ప్రముఖ కార్టూనిస్టు పరేష్ నాథ్‌కు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. 18 మంది ప్రముఖ ఒడిశా కార్టూనిస్టులు అభిషేక్ నాయక్, అశ్విని ఒబొని, బిమల్ దాస్, చూడామణి దాస్, దేవాశిష్ సింగ్, కమలాకాంత్ రథ్, కేశు దాస్, నందేషు, పరేష్ నాథ్, ప్రద్యుమ్న నటువా, ప్రశాంత్ మహాకుడు, ప్రశాంత్ మాఝీ, రవి శర్మ, ముందూరు శేఖర్‌రావు, శివనారాయణ, సుదాం శేఖర్ రెడ్డి, సునరామ్ సింగ్ ప్రత్యేక సత్కారం అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment