కర్ర వంతెనపై రాకపోకలు ఆపేయండి
రాయగడ: జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి తొలొసజ్జ గ్రామ సమీపంలో గల నాగావళి నదిపై గ్రామస్తులు తాత్కాలికంగా నిర్మించుకున్న కర్ర వంతెనను జిల్లా యంత్రాంగం నిషేధించింది. ఈ మేరకు బ్యానర్‌ను రహదారి వద్ద ఏర్పాటు చేసింది. గతకొద్ది రొజుల క్రితం ఈ గ్రామానికి చెందిన ప్రజలు సంయుక్తంగా కర్ర వంతెనను నాగావళి నదిపై నిర్మించుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. తమ గ్రామానికి మధ్యలో గల నాగావళి నదిపై రాకపొకలు కొనసాగేలా వంతెన నిర్మించాలని పలు సార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో అందరూ కలిసి రాకపోకలకు అనుకూలంగా నదిపై కర్ర వంతెను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న యంత్రాంగం స్పందించి వంతెనపై రాకపోకలు కొనసాగించకూడదని నిషేధించింది. సమితిలోని సికరపాయి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ సొబొరొ ఈ మేరకు బ్యానర్‌ను రహదారి ముందు ఏర్పాటు చేశారు. అందుకు ససేమిరా అంటూ గ్రామస్తులు వంతెనపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇటు వంతెన నిర్మించడానికి పట్టించుకొని ప్రభుత్వం తాము ఏర్పాటు చేసిన వంతెనపై రాకపోకలను ఎలా నిషేధిస్తుందని గ్రామస్తులు అంటున్నారు. కర్రవంతెనపై రాకపోకలు కొనసాగిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతోనే దీనిని నిషేధించామని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment