పీఎఫ్ కార్యాలయం ముట్టడి
జయపురం: జయపురం సేవాపేపరు మిల్లు కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బరంపురంలోని పీఎఫ్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించినట్లు సేవా పేపరుమిల్లు కార్మిక యూనియన్ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ మహంతి శనివారం తెలిపారు. ఏఐటీయూసీ నేతృత్వంలో మిల్లు కార్మికులంతా ఆందోళనలో పాల్గొన్నట్లు చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఎఫ్ కమిషనర్ ప్రకాశ్‌నారాయణ సింగ్‌కు వినతులు సమర్పించామని తెలిపారు. పేపర్ మిల్లులో పనిచేస్తున్న 1262 మంది కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేత ప్రబీర్‌దాస్, ప్రదీప్ శెట్టి, కామదేవ్ నాహక్, రోహిత్ నాయిక్, మిల్లు కార్మిక సంఘ కార్యదర్శి కె.సత్యనారాయణ, బసంత బెహరా తదితరులు పాల్గొన్నారు.
యువకుడు ఆత్మహత్య
మల్కన్‌గిరి : జిల్లాలోని కలిమెల సమితి ఎం.వి.పి– 90 గ్రామానికి చెందిన భక్త జాని (23) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జాని స్వగ్రామం కళ్లహండి జిల్లా గులాముంఢ గ్రామం. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి మేనమామ మంగరాజ్ మాఝి ఇంట్లో నివాసముంటున్నాడు. శుక్రవారం రాత్రి అందరితో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. ఇంతలో ఏం జరిగిందో గానీ ఓ గదిలో తువ్వాలుతో ఉరివేసుకుని చనిపోయాడు. ఉదయం నిద్రలేచిన మంగరాజ్ గదికి వెళ్లగా జానీ వేలాడుతూ కనిపించాడు. వెంటనే కలిమెల పోలీసులకు సమాచారమిచ్చారు. ఐఐసీ చంద్రకాంత్ తండ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
విదేశీ మద్యంతో ఇద్దరు అరెస్టు
మల్కన్‌గిరి: బలిమెల కూడలి వద్ద శుక్రవారం రాత్రి బలిమెల ఐఐసీ దీరాజ్ పట్నాయక్ నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు మల్కన్‌గిరి నుంచి చిత్రకొండకు అక్రమంగా తరలిస్తున్న విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించారు. వారి వద్దనుంచి 60 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరేస్ట్ చేసి విచారించారు. చిత్రకొండ సమితికి చెందిన రాకేష్ సింగ్, మనోజ్ తురాక్‌గా తెలిసింది. శనివారం వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు.
కారు బీభత్సం
● పేవ్‌మెంట్ పైకి దూసుకువచ్చిన వైనం
● ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
భువనేశ్వర్: నగరంలో ఓ కారు బీభత్సం సృషించింది. ఒకేసారి పలు ప్రమాదాలకు పాల్పడిన కారు ఒకరి ప్రాణాల్ని బలిగొంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రాజ్ భవన్ కూడలి ప్రాంతంలో శనివారం ఉదయం ఈ వరుస ప్రమాదాల సంఘటన చోటు చేసుకుంది. వేగంతో దూసుకుపోయిన కారు బైక్‌ను ఈడ్చుకుంటూ మరో బైక్‌ని ఢీకొంది. దీంతో రాజ్ భవన్ చక్ వద్ద పేవ్‌మెంట్ పైకి దూసుకుపోయింది. కారు ఢీకొనడంతో ఇద్దరు బైక్ చోదకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక క్యాపిటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment