కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా దీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్ : కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా దశల వారీ పోరాటాలు చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకుడు మద్దిల రామారావు అన్నారు. కార్గో ఎయిర్‌పోర్టుకు బలవంతపు భూసేకరణ ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టవద్దని డిమాండ్ చేస్తూ పోరాట కమిటీ, వామపక్షాల ఆధ్వర్యంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నారో సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును ప్రశ్నించారు. కార్గో ఎయిర్‌పోర్టు పేరిట మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లోని 20 గ్రామాల్లో 1400 ఎకరాల భూమిని ప్రజల వద్ద నుంచి బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ చర్యలు మానుకోకపోతే, ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన దీక్షలో సీపీఎం నాయకులు బి.కృష్ణమూర్తి, పోరాట కమిటీ నాయకులు లండ రామస్వామి, జోగి అప్పారావు, చిత్త గున్నయ్య, మర్ల సంతోష్, తెప్పల గున్నయ్య, నల్ల పరుశురాం, గుంటు లోకనాథం, డి.సురేష్, డి.దానయ్య, ఎస్.రాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహన్ రావు, జి.సింహాచలం, టి.అజయ్‌కుమార్, ప్రజాసంఘా ల నాయకులు మామిడి తులసయ్య, మామిడి మా ధవరావు, హేమారావు చౌదరి, నల్ల హడ్డి, వంకల మాధవరావు, పి.కుసుమ, కృష్ణవేణి, నీలంరాజు, భాస్కరరావు, డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment