చంద్రబాబూ.. ఎస్సీ విభజన జోలికి పోవద్దు
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో ఎస్సీ విభజన జోలికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోకూడదని, కాదని ముందుకెళ్తే దళితులను, ఓబీసీలను కలుపుకొని పోరాటం చేస్తానని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసం ఎస్సీలను వాడుకోవద్దని చంద్రబాబుకు సూచించారు. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, అంబేడ్కర్ వంటి వారి వల్ల ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, రిజర్వేషన్లు వచ్చాయన్నారు. ఎస్సీల వర్గీకరణపై మిశ్రా నేతృత్వంలో వన్‌మ్యాన్ కమిషన్ వేశారని, అతనికి దళితుల స్థితిగతులపై కనీస అవగాహన కూడా లేదన్నారు. చంద్రబాబు ఆలోచనా విధానం తప్పని, ఈ కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర విభజనకు, దళిత విభజనకు చాలా దగ్గర సంబంధం ఉందన్నారు. దళిత విభజన కోసమే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏం సాధించారని ప్రశ్నించారు. అమరావతిలో కట్టడాల కోసం హడ్కో సంస్థ నుంచి సీఆర్‌డీఏకు రూ.11వేల కోట్లను 15 ఏళ్ల కాలపరిమితితో 9 శాతం వడ్డీకి అప్పు తెచ్చారని, ప్రతి మూడు నెలలకు వడ్డీ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. అసలు అప్పులు చేసి అమరావతిని నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఇటీవల కేంద్రం రూ.11,400 కోట్లు కేటాయించిందని, ఈ నిధులు ఏమాత్రం సరిపోవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment