నిరుపయోగంగా ఈత కొలను
నరసరావుపేట: తాము అధికారంలోకి వస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కూటమి నాయకులు... ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలవుతున్నా ఈ విషయంలో విఫలం అవుతున్నారు. సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు (డీఎస్‌ఏ) స్టేడియంలో మూతపడిన స్విమ్మింగ్ పూల్ తెరవడంలో కూడా ఇలా మీనమేషాలు లెక్కిస్తున్నారు. రూ.2.11కోట్లతో నిర్మించిన ఈ కొలనులో ఎంతో మంది ఈత నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2019 జనవరి 7వ తేదీన దీన్ని నిర్మించారు. అప్పట్లో వ్యాయామం కోసం ఉదయం, సాయంత్రం పలువురు ఇక్కడ ఈత కొట్టి సేదతీరారు. యువతీయువకులు, విద్యార్థులు ఈత నేర్చుకున్నారు. ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల ఈత కొలనుకు పోటీగా ఈ పూల్ ఏర్పడింది. ఒకానొక సమయంలో దీనిని నిర్వహించలేక కళాశాల యాజమాన్యం ఈత కొలను మూసేయాలనే ఆలోచన చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. గత ప్రభుత్వంలో స్టేడియంలోని ఈత కొలనుకు కావాల్సిన అదనపు సౌకర్యాలను అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కల్పించారు. నిర్వహణ లోపంతో క్రమంగా మూత పడింది. డీఎస్‌ఏ అధికారులు ఎవరూ మళ్లీ తెరిచే ప్రయత్నం చేయలేదు. దీనిని సాకుగా తీసుకొని గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ చదలవాడ అరవిందబాబు అనేకమార్లు అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాము అధికారంలోకి రాగానే మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. గెలుపొందిన పదీపదిహేను రోజులలో పరిశీలించిన ఎమ్మెల్యే .. ఈతకొలను వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజలకు అందజేస్తానన్నారు. ఈ మాట చెప్పి నెలలు అవుతున్నా అతీగతీ లేదు. స్టేడియంలో పారిశుద్ధ్య నిర్వహణ, కావాల్సిన సౌకర్యాలను పురపాలక నిధులతోనే చేస్తున్నారు. స్టేడియం బాగోగులు, కార్యకలాపాలు చూసే శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ) నుంచి ఎటువంటి భరోసా లభించలేదు. దీనిపై జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి నరసింహారెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
అధికారంలోకి రాగానే
వినియోగంలోకి తెస్తానన్న ఎమ్మెల్యే
ఐదు నెలలు గడుస్తున్నా
హామీ నెరవేర్చని వైనం
Comments
Please login to add a commentAdd a comment