గుండెల్లో దావానలం
రొంపిచర్ల: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మాగాణి వరి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ ఏడాది మండలంలో 25 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. డిసెంబర్ 15 నాటికి 2 వేల ఎకరాల్లో మాత్రమే కోతలు పూర్తి చేశారు. అప్పటి వరకు వాతావరణం పొడిగా ఉండటం వల్ల వరి కోతలకు, ధాన్యం ఇళ్లకు చేర్చేందుకు అనుకూలంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కోతలకు ఆటంకం కలిగింది. ధాన్యాన్ని ఇళ్లకు చేర్చేందుకు కర్షకులకు అధిక ఖర్చయింది. వర్షానికి ధాన్యం తడిచిపోవడంతో కల్లాల్లో రైతులు ఆరబెట్టుకున్నారు. దీనికీ ఎక్కువ ఖర్చు అవుతోందని ఆవేదన చెందుతున్నారు. డిసెంబర్ 15వ తేదీ నాటికి సూఫర్ ఫైన్ రకం ధాన్యం 75 కేజీలు బస్తాకు రూ.1,800 వరకు ధర పలకగా, ప్రస్తుత పరిస్థితితుల్లో ఆ ధాన్యాన్ని రూ.1,600కూ కొనేందుకు వ్యాపారులు ముందుకు రావటం లేదు. జేజీఎల్ రకం ధాన్యం ధర రూ.1,600 నుంచి రూ.1,500కు పడిపోయింది. అలాగే బీపీటీ రకం ధాన్యం ధర రూ.1500 నుంచి రూ.1400లకు పడిపోగా ఆ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పెద్దగా మొగ్గు చూపటం లేదు. వర్షంతో పొలంలో బురద ఎక్కువగా ఉండటం వల్ల వర్షానికి ముందు 2,500 రూపాయలే హార్వెస్టింగ్‌కు ఖర్చయింది. వర్షం వల్ల వరి నేలవారటం వల్ల 3,500 రూపాయల వరకు కోత వ్యయం పెరిగింది. దీనికి తోడు ధాన్యం డ్రై అయ్యేందుకు వారం రోజుల సమయం పడుతుంది. వర్షానికి ముందు మూడు నాలుగు రోజుల్లో ధాన్యాన్ని డ్రైచేసి అమ్మకాలు జరిపారు. ప్రస్తుతం ధాన్యం డ్రై అయ్యేందుకు వారం రోజులకుపైగా సమయం పడుతుంది. దీంతో అదనపు కూలీలు, అదనంగా పరదా పట్టాలకు అద్దెలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు ఒకేసారి హార్వెస్టింగ్‌కు రైతులు సిద్ధం కావడంతో ట్రాక్టర్‌లకు, కూలీలకు కూడా కొంత గిరాకి ఏర్పడింది. వానల వల్ల ఎకరాకు 5 బస్తాల దిగుబడిలో వ్యత్యాసం వస్తోందని రైతులు చెబుతున్నారు.
వర్షంతో రైతులకు ఎన్ని నష్టాలో.. ధాన్యం రేటు తగ్గింది వ్యవసాయ ఖర్చులు పెరిగాయి తగ్గిన దిగుబడి
ధాన్యం రేటు తగ్గింది
15 రోజుల క్రితం రూ.1600 పలికిన జేజీఎల్ ధాన్యం బస్తా ప్రస్తుత తరుణంలో అమ్మాలంటే రూ.1500కు కొనేందుకు కూడా వ్యాపారులు సంశయిస్తున్నారు. ధాన్యం రేటులో వచ్చిన తేడా వల్ల ఎకరాలో పండిన ధాన్యం రేటులో 15 రోజుల వ్యవధిలో రూ.4,000 వరకు వ్యత్యాసం వచ్చింది.
– ఇఫ్రాంవలి, రైతు, విప్పర్ల
బాడుగ ఖర్చులు పెరిగాయి
వర్షం వల్ల బురద పేరుకుపోయిన నేపథ్యంలో కోత మిషన్ తిరిగేందుకు పొలం అనుకూలంగా ఉండడం లేదు. దీంతో కోతకు ఎక్కువ సమయం పడుతుంది. పొలంలోని ధాన్యం బస్తాలను ఇంటికి చేర్చాలంటే దారి అనుకూలంగా లేదు. దీంతో వాహనాల బాడుగ, కూలీల ఖర్చు భారీగా పెరిగింది.
– కోటేశ్వరరావు, రైతు, సంతగుడిపాడు
Comments
Please login to add a commentAdd a comment