తల్లి మృతిని జీర్ణించుకోలేక.. గుండెపోటుతో కుమారుడు మృతి
ముప్పాళ్ళ: నూతన సంవత్సర వేడుకల వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వృద్ధురాలైన తల్లి మృతి చెందటాన్ని జీర్ణించుకోలేక కుమారుడు తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించిన ఘటన ముప్పాళ్ళలోని ముస్లిం కాలనీలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ముస్లిం కాలనీకి చెందిన షేక్ రహంతుల్లా(57) తల్లి లతిమున్నీసా(90) 27 రోజుల క్రితం మృతి చెందింది. ఒక్కొగానొక్క కొడుకు కావడంతో చిన్ననాటి నాటి నుంచి రహంతుల్లాను లతిమున్నీసా ఎంతో గారాభంగా పెంచింది. రహంతుల్లాకూ తల్లి అంటే ఎంతోప్రేమ. దీంతో తల్లి మృతిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రహంతుల్లా వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. కాంగ్రెస్ పార్టీలో మండల యూత్ అధ్యక్షుడిగానూ, తర్వాత పార్టీ మండల అధ్యక్షుడిగానూ పనిచేశారు. అనంతరం వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్సార్ సీపీలో చేరి పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. రహంతుల్లాకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకులు యర్రం వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, బ్రహ్మారెడ్డి, అన్నపురెడ్డి సాయిరెడ్డి, మధిర వెంకటేశ్వరరెడ్డి, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment