విద్యార్థుల చదువును పర్యవేక్షించాలి
పార్వతీపురం: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల చదువును రాత్రి వేళల్లో ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ఆదివారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. మరికొద్ది నెలల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థి పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. పాఠశాలల్లో చదువుతో పాటు విద్యార్థులు ఇంటి వద్ద ఏ విధంగా చదువుతున్నారో నిత్యం ఓ కంట కనిపెట్టాలన్నారు. ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో హాజరు ఉండి, ఫిజికల్‌గా లేకపోతే సంబంధిత ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
ఎయిర్ మెన్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో మెడికల్ అసిస్టెంట్, ఫార్మాసిస్టు ట్రేడుల్లో ఎయిర్ మేన్‌గా చేరేందుకు శాశ్వత ప్రాతిపదికన నియామకం చేపట్టేందుకు నోటిఫికేషన్ విడుదలైందని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్, బీఎస్సీ, డిప్లమో ఇన్ ఫార్మసీ అర్హతతో మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పించడం జరుగుతుందన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్, రాత పరీక్ష, మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. 3–07–2001 నుండి 03–07–2004 మధ్య పుట్టిన ఆసక్తి గల అభ్యర్థులు మహారాజష్ కళాశాల గ్రౌండ్, పీటీ ఉషా రోడ్డు, షీనస్, ఎర్నాకుళం, కొచ్చి, కేరళ చిరునామాలో ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జరిగే రిక్య్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనాలని ఆయన సూచించారు. వివరాలకు హెచ్‌టీటీపీఎస్://ఎయిర్‌మెన్‌సెలక్షన్.సీడీఏసీ.ఇన్ వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు. జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం అభ్యర్థులు 91772 97528 నంబరును, పాలకొండ నియోజకవర్గ అభ్యర్థులు 79937 95796ను, సాలూరు 73825 59022 నంబరును సంప్రదించాలని తెలిపారు.
నేడు సాలూరులో గ్రీవెన్స్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)ను సోమవారం సాలూరులో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాలూరు ఎంపీడీఓ కార్యాలయంలో గ్రీవెన్స్‌ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను సాలూరులో సమర్పించవచ్చునన్నారు. జిల్లా అధికారులంతా సాలూరులో నిర్వహించే పీజీఈఆర్‌ఎస్‌కు హాజరు కావాలని సూచించారు. అనంతరం శంబర జాతరపై సంబంధిత అధికారులతో సమీక్షించనున్నట్టు తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment