5న సాలూరులో జాబ్ మేళా
పార్వతీపురంటౌన్: సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 5న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 28 ఏళ్ల వయస్సుగల యువత జాబ్ మేళాకు అర్హులన్నారు. 10, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదువుతున్న యువతకు 25 కంపేనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఆసక్తి గల యువత హెచ్‌టీటీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేసి రిఫరెన్సు నంబర్, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్సులతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్: 94947 77553, 73825 59022 నంబర్లను సంప్రదించాలన్నారు.
మొదటి సంతకం అమలు కోసం పోరాటం
పార్వతీపురంటౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి సంతకమైన డీఎస్సీ నోటిఫికేషన్, గిరిజన మంత్రి మొదటి సంతకం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎమ్‌ల నియామకం జరిగేలా కొత్త సంవత్సరంలో పోరుబాట సాగిస్తామని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజీత్ కుమార్ తెలిపారు. గిరిజన హక్కులు, ఐటీడీఏ మనుగడ, గిరిజన సంక్షేమం కోసం ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో తల్లికి వందనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
పార్వతీపురం: కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌కు జిల్లా అధికారులు, ఉద్యోగులు బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని, అన్ని రంగాల్లో జిల్లా పురోభివృద్ధికి సహకరించాలని ఉద్యోగులకు కలెక్టర్ సూచించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కేఆర్‌సీసీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, డీఈఓ డా.ఎన్.తిరుపతినాయుడు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, వ్యవసాయాధికారి రాబర్ట్ పాల్, పశుసంవర్థకశాఖాధికారి మన్మథరావు, మత్స్యశాఖాధికారి వి.తిరుపతయ్య, పీఆర్ ఈఈ వి.వి.నగేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, ఇరిగేషన్ ఈఈ ఆర్.అప్పలనాయుడు, తదితరులు ఉన్నారు.
ఫ్లెక్సీల చించివేత
గుమ్మలక్ష్మీపురం (కురుపాం): నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని కురుపాం మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీనిపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫ్లెక్సీలు చించివేయడం పిరికిపంద చర్యగా పేర్కొన్నాయి. ఇలాంటి సంస్కృతి కొనసాగితే సహించేది లేదని హెచ్చరించాయి.
ఉద్యోగాల్లో కొనసాగించాలి
● మహిళల ఆందోళన
తగరపువలస: విజయనగరం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 170 మంది మహిళలు బుధవారం ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం స్ప్రింట్ సీ ఫుడ్స్ సంస్థ ముందు ఆందోళన చేపట్టారు. పదేళ్ల నుంచి పనిచేస్తున్న తమను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని వారు ఆరోపించారు. నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంతో మాట్లాడేందుకు మహిళలు ప్రయత్నం చేయగా.. సిబ్బంది అనుమతించలేదు. దీంతో గేటు ముందు బైఠాయించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment