హలో.. నా పేరు డైరీ..
హలో.. నా పేరు డైరీ. కొందరు దైనందిని అంటారు. ఇప్పటితరానికి నా గురించి అంతగా పరిచయం ఉండకపోవచ్చు. పాత తరానికి నేను ఆత్మీయ నేస్తాన్ని. నిత్యం నన్ను దసూర్తితో స్పృశించేవారు. ఏడాదిలో 365 రోజులూ (లీప్ సంవత్సరం వస్తే 366 రోజులు పాటు) తమ అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు, లెక్కలు, ఖర్చులు, ప్రణాళికలు.. ఇలా ఒకటేమిటి వారి అంతరంగమంతా నాపై అక్షరాలుగా పరిచేవారు. అవసరమైనప్పుడు, పాత రోజుల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు నాలోని పేజీలు తిరగేస్తే గడిచినకాలం మళ్లీ కళ్లముందు కదలాడేది. సందర్భం, అందులోని విషయం ఆధారంగా వారి ముఖంలో దాదాపు నవరసాలు ప్రస్ఫుటమయ్యేవి. కొత్త ఏడాది వస్తుందంటే నన్ను సమకూర్చుకునేందుకు చాలామంది ఆరాటపడేవారు. నాలోని రోజుకో పేజీని కేటాయించేవారు. కొందరైతే ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలంటూ భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ప్రణాళిక చే(రా)సుకునేవారు. ఇంకొందరు తమ రాతలను పునఃశ్చరణ చేసుకొని లోటుపాట్లను అధిగమించే ప్రయత్నం చేసేవారు. చాలామంది నాలోని రాతలను నిజం చేసుకొని ఉన్నత స్థానాలకు వెళ్లి దశాబ్దాల కాలం పాటు తాము సాధించిన విజయాన్ని చిరస్మరణీయంగా భద్రపర్చుకునేవారు. సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతూ సామాజిక మాధ్యమాలు, బ్లాగుల్లో సందేశాలు, అభిప్రాయాలు పంచుకుంటున్నా.. నా పేజీలో రాసిన అక్షర సత్యం ఇచ్చే సంతృప్తి ఇవ్వదన్నది చాలామంది నోట వినిపిస్తోంది. యవ్వనంలో మీరు నింపిన నా పేజీలను మీ పిల్లలకు చూపిస్తే ఆ కిక్కేవేరన్నది మీకు తెలియని కాదు. ఆ రోజులు ఎలా ఉండేవి.. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునే సూచనలను ప్రత్యేకంగా పిల్లలకు చెప్పాల్సిన పని ఉండదు. ఆ రోజు రానే వచ్చింది. నన్ను మరోసారి గుర్తుచేసుకుంటారని ఆశిస్తూ మీ ఆత్మీయ డైరీని. – విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment