మొక్కవోని ఆసక్తి..!
పాలకొండ రూరల్: మొక్కల పెంపకం ఓ కళ. అందమైన మొక్కలు ఇంటికి అందాన్నే కాదు... మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్నిస్తాయి. ఆరోగ్యకరమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఇంటికి వచ్చేవారిని ఆకర్షిస్తాయి. ఇటీవల కాలంలో ఇంటి పెరటిలోనే కాదు.. కార్యాలయాల్లోనూ వివిధ రకాల మొక్కల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా వ్యాపారులు స్థానికంగా నర్సరీలు ఏర్పాటుచేసి మొక్కలను విక్రయిస్తున్నారు. ప్రజల అభిరుచికి అనుగుణంగా గోదావరి జిల్లాల్లోని కడియం నుంచి మొక్కలను తెప్పిస్తున్నారు. రూ.10 నుంచి రూ. 1000లు విలువైన మొక్కల విక్రయం సాగుతోంది. కొందరు పూలమొక్కలతో పాటు కూరగాయల మొక్కల పెంపకంపైనా ఆసక్తి చూపుతున్నారు.
అన్నింటా మొక్కలకే ప్రాధాన్యం
మొక్కల పెంపకంపై ప్రజల ఆసక్తి
అందుబాటులోకి నర్సరీలు
రూ.10 నుంచి మొక్కల ధరలు
తులసి నుంచి
మనీ మొక్క వరకు అమ్మకం
కడియం నుంచి తెప్పిస్తున్న మొక్కలు
ఆలయాల ప్రారంభోత్సవం, గృహప్రవేశాలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు స్వాగతం ఇలా... ఏ శుభకార్యమైనా పచ్చని మొక్కల వినియోగం ఇటీవల కాలంలో పెరిగింది. కొందరు అధికారులైతే అభినందనలు తెలియజేసేందుకు మొక్కలు పట్టుకుని రావాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొక్కల కొనుగోళ్లు విరివిగా సాగుతున్నాయి. నర్సరీల్లో రోజుకు రూ.50వేల వరకు వ్యాపారం సాగుతున్నట్టు అంచనా. గులాబీ, మందారం, చామంతి మొక్కల విక్రయాలు అధికంగా సాగుతున్నాయి. వీటితోపాటు మనీప్లాంట్, లక్కీ ప్లాంట్, లక్కీబేంబో, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, తైవాన్ జామ, హైబ్రీడ్ కొబ్బరి, అరటి, బోగనవల్లీ, యాపిల్ తదితర మొక్కలను సైతం కొనుగోలు చేస్తున్నారు. తులసి మొక్క ధర అత్యల్పంగా రూ.10లు కాగా, బోగనవల్లీ మొక్క ధర రూ.1000లు పలుకుతోంది. దాలియా, మల్లి, సన్నజాజి. వంగ, మిరప వంటి మొక్కలను విక్రయిస్తున్నారు. ఆర్‌కే ఫాండ్స్ అనే ఆక్సిజన్ మొక్కలను ఇటీవల ఎక్కువుగా కొనుగోలు చేస్తున్నారు. ఈ మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయనే అభిప్రాయం అందరిలో ఉంది. దేవాలయాల్లో వేసే ఏక బిల్వం, మహా బిల్వం, మారేడు, ఉసిరి, జమ్మి, శంకు, రుద్రాక్ష, పసుపు గన్నేరుతోపాటు పూజలకు వినియోగించే పలు మొక్కలకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుందని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment