వైద్యం కోసం వెళ్తూ.. మృత్యు ఒడికి
చిన్నారికి శస్త్ర చికిత్స చేయించాలని ఓ కుటుంబం... వృద్ధులకు వైద్యపరీక్షలు చేయించాలని మరికొందరు... ఇలా సుమారు 40 మంది ఆస్పత్రి బస్సులో పయనమయ్యారు. మరికాసేపట్లో ఆస్పత్రికి చేరుకుంటారన్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం వారిలో కుదుపురేపింది. ఓ కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తెను మృత్యువు కాటేసింది. ఆస్పత్రికి వెళ్లకుండానే అనంతలోకాలకు తీసుకుపోయింది.
గజపతినగరం/మల్కన్‌గిరి: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి ఎం.వి–58 గ్రామం, పరిసర గ్రామాలకు చెందిన సుమారు 40 మంది అనిల్ నీరుకొండ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ బస్సులో వైద్యసేవల కోసం శుక్రవారం రాత్రి బయలుదేరారు. శనివారం ఉదయానికి ఆస్పత్రికి చేరుకుంటామని అంతా భావించారు. ఇంతలోనే విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుపాడ పాలదారి చెరువు వద్ద ఆగి ఉన్న లారీని బస్సు బలంగా ఢీకొట్టింటి. అంతే... ఆ ప్రాంతం హాహాకారాలతో మిన్నంటింది. బస్సులో ఉన్నవారంతా చెల్లాచెదురుగా పడ్డారు. ప్రమాదంలో 16 మంది గాయపడగా, వీరిలో తండ్రి, కుమార్తెలు సుభ్రత్‌రాయ్(35), మెహత్ రాయ్ (మూడున్నరేళ్లు) దుర్మరణం చెందారు. సుభ్రత్‌రాయ్ తన కుమార్తెకు బీఎస్‌కేవీ (బిజు స్వాత్య కల్యాణ్ యోజన) పథకం కింద అనిల్ నీరుకొండ ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్స చేయించేందుకు బయలుదేరగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కళ్లముందే విగతజీవులుగా మారిన భర్త, కుమార్తెను చూసి మీరా సర్కార్ బోరున విలపించింది. ఆమె స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. గాయపడిన ఎనిమిది మందిని వైద్యసేవల కోసం గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించగా, మిలిలిన వారిని అనీల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించారు. మల్కన్‌గిరి జిల్లాలోని కలిమెల, పోడియా సమితి పరిధిలోని గ్రామాల ప్రజలను గతంలోనూ ఇలా బస్సుల్లో తీసుకెళ్లి ఉచితంగా శస్త్రచికిత్స చేయించేవారని గ్రామస్తులు తెలిపారు. ఈ సారి బస్సులో వెళ్తే ప్రమాదానికి గురికావడంతో ఆయా గ్రామాల్లో విషాదం అలముకుంది. ఎస్‌ఐ కె.లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు
తండ్రి, కుమార్తెల దుర్మరణం
16 మందికి గాయాలు
మిన్నంటిన హాహాకారాలు
Comments
Please login to add a commentAdd a comment