పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత
జియ్యమ్మవలస: మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. మండలంలోని పెదకుదమ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లాను పరిశుభ్రమైన జిల్లాగా మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతినెలా మూడో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, నివాసిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రదేశాలను పరిశుభ్రం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. తడి, పొడిచెత్తను వేరుచేసి ఎప్పటికప్పుడు పురపాలక సిబ్బందికి అందజేయాలన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛ పరిసరాలను అందించే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. గ్రామంలోని పారిశుద్ధ్యం, కాలువలు, తాగునీటి పైపులైన్లు తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ కె.రామచంద్రరావు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment