పీడీకిలి బిగిస్తున్నారు
● గూండాలు, రౌడీలు, దొంగలపై పోలీసుల ఉక్కుపాదం ● రామగుండం కమిషనరేట్ పరిధిలో 151 పీడీ కేసులు నమోదు ● శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తప్పవంటున్న సీపీ
గోదావరిఖని: అక్రమార్కులపై రామగుండం కమిషనరేట్ పోలీసులు పిడికిలి బిగిస్తున్నారు. సమాజంలో ఉద్రిక్తతలు సృషిస్తూ శాంతిభద్రతలకు విఘా తం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పాత నేరస్తులపై నిఘా పెంచారు. ఇప్పటికే గుర్తించిన వారిపై పీడీయాక్టు నమోదు చేస్తున్నారు. మరికొందరిపై ఈ యాక్టు నమోదు చే సేందుకు సిద్ధమయ్యారు. కమిషరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఇప్పటివరకు పీడీయాక్ట్‌లు 151కి చేరాయి. పీడీయాక్టు నమోదు చే యడంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాత రామగుండం కమిషనరేట్ అగ్రస్థానంలో నిలిచిందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
నిఘా తీవ్రతరం
రౌడీషీటర్లపై పోలీసు నిఘా తీవ్రతరం చేశారు. ఠాణాల వారీగా నేరస్తుల జాబితా తయారు చేసిన పోలీసు అధికారులు.. తోక ఊపితే పీక నొక్కుతామని హెచ్చరిస్తున్నారు. వరుస హత్యలు, అల్లర్లతో ఇప్పటిదాకా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉక్కుపాదం మోపుతోంది. దీంతో ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. భూమాఫియా, రౌడీయిజం, గుట్కాదందా, అక్రమ కలప రవాణా, రేషన్ బియ్యం దందా, దొంగలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. పాత నేరస్తులు మళ్లీ నేరాలకు పాల్పడితే పీడీయాక్టు నమోదు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఒక్కరోజే ముగ్గురిపై..
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై దృష్టి సారించిన పోలీసులు.. ఒక్కరోజే ముగ్గురిపై పీడీయాక్టు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని, నేరస్తుల ఏరివేత ద్వారానే సమాజంలో శాంతి ఏర్ప డుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈక్రమంలో గత శుక్రవారం జిల్లా కేంద్రంలో పీడీయాక్టు నమోదైన, రౌడీషీటర్లకు రామగుండం పోలీస్‌కమిషనర్ శ్రీనివాస్ కౌన్సెలింగ్ ఇచ్చారు. పాత నేరస్తులపై నిఘా తీవ్రతరం చేశామని, మళ్లీ నేరాలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
151కి చేరిన పీడీ యాక్టు కేసులు..
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పీడీయాక్టు కేసులు ఇప్పటివరకు 151కి చేరాయి. పెద్దపల్లి జిల్లాలో 86, మంచిర్యాల జిల్లాలో 65 పీడీయాక్టు కేసులు నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా దొంగలపైనే పీడీ కేసులు నమోదు కావడం గమనార్హం. రెండోస్థానంలో సమాజంలో భయాందోళనలు సృష్టించే రౌడీలపై పీడీయాక్టు పెట్టారు. మూడు కేసులు నమోదైన నిందితులపై పీడీయాక్టు అమలు చేస్తున్నారు. వరుస దొంగతనాలు, రౌడీయిజం, హత్యలు, పేకాట గ్యాంగ్‌లు, కలపస్మగ్లర్లు, అక్రమ భూదందాలు నిర్వహించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తూ పాతనేరస్తుకు హెచ్చరికలు జారీచేస్తున్నారు.
కమిషనరేట్ పరిధిలో నమోదైన
పీడీ యాక్ట్ కేసులు
నేరాల తీరు
గూండాలు 34
చోరీల్లో నిందితులు 69
రేషన్ బియ్యం సరఫరా 01
డ్రగ్ నేరస్తులు 07
అక్రమ కలప రవాణా 03
వైట్‌కాలర్ నేరస్తులు 10
సెక్స్‌వల్ నేరస్తులు 03
గేమింగ్ 01
నకిలీ విత్తనాలు 18
భూమాఫియా 05
కమిషనరేట్ పరిధిలో ..
రౌడీ షీటర్లు 456
హిస్టరీ షీటర్లు 1,288
ఏడాది పెద్దపల్లి మంచిర్యాల మొత్తం
2017 01 0 01
2018 05 02 07
2019 16 11 27
2020 27 16 43
2021 10 14 24
2022 0 0 0
2023 07 02 09
2024(ఇప్పటివరకు) – 01 01
ఎవరినీ ఉపేక్షించేదిలేదు
శాంతిభద్రతలకు విఘా తం కలిగించే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదు. వరుసనేరాలకు పాల్పడే వారిపై డేగకన్ను వేశాం. కమిషనరేట్ పరిధిలో 151 వరకు పీడీ యాక్టు కేసులు చేరాయి. ప్రజలు శాంతియుతంగా జీవించాలనేదే పోలీస్‌శాఖ లక్ష్యం. ఈవిషయంలో రాజీపడే ప్రసక్తేలేదు. సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీషీట్ ఎత్తివేసేందుకు కూడా యోచిస్తున్నాం.
– శ్రీనివాస్, పోలీస్ కమిషనర్, రామగుండం
Comments
Please login to add a commentAdd a comment