అదృశ్యమైన బాలుడిని పట్టించిన సెల్‌ఫోన్
మెట్‌పల్లి: పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి అదృశ్యమైన బాలుడిని పోలీసులు పెద్దపల్లి జిల్లా కొలనూర్‌లో పట్టుకున్నారు. పోలీసుల కథ నం ప్రకారం.. మెట్‌పల్లికి చెందిన బాలుడు స్థానిక ప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం వేకువజా మున 3.30గంటల సమయంలో వార్డెన్ సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు. విషయాన్ని వార్డెన్ బాలుడి తండ్రికి సమాచారం చేరవేయగా.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలుడి వద్దనున్న సెల్ నంబర్‌కు సీడీఆర్ టెక్నాలజీని ఉపయోగించారు. పెద్దపల్లి జిల్లా కొలనూర్ రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి పొత్కపల్లి పోలీసులకు సమాచారం అందించా రు. వారు అక్కడకు వెళ్లి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడు మెట్‌పల్లి నుంచి రైలులో అక్కడకు వెళ్లినట్లు తెలిసింది. పది గంటల్లోనే బాలుడిని పట్టుకున్న సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సై కిరణ్‌కుమార్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.
అవార్డులకు రెస్క్యూ బ్రిగేడియర్ల ఎంపిక
గోదావరిఖని: రెస్క్యూ బ్రిగేడియర్లు అవార్డులు అందుకోనున్నారు. రెస్క్యూలో 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న సింగరేణిలోని 28మందిని ఈ వార్డుకు ఎంపిక చేశారు. కోలిండియా హెడ్‌క్వార్టర్స్, ధన్‌బాద్‌లో ఈనెల 20న జరిగే ఆలిండియా రెస్క్యూ పోటీల సందర్బంగా వీరికి అవార్డులు అందజేయనున్నారు. కార్యక్రమంలో పాల్గొనడానికి రామగుండం ఏరియా నుంచి వారు అయోధ్యకు తరలివెళ్లారు. అక్కడ నుంచి కాశీకి వెళ్లి తర్వాత ధన్‌బాద్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
గృహ హింస కేసులో ఒకరికి జైలు
సిరిసిల్ల కల్చరల్: అదనపు కట్నం ఆశించి శారీరకంగా, మానసికంగా భార్యను వేధించిన వ్యక్తికి న్యాయస్థానం ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. వివరాలు.. 2015 జనవరి 22న సిరిసిల్లలోని బద్దం ఎల్లారెడ్డినగర్‌కు చెందిన అఫ్రీన్ అనే మహిళ అదనపు కట్నం కోసం తన భర్త, అతడి బంధువులు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చార్జ్‌షీటు సమర్పించిన తర్వాత కేసు విచారణ పూర్వాపరాల పరిశీలన అనంతరం న్యాయస్థానం నిందితుడు షేక్ నవాజ్‌కు ఏడాదిన్నర సాధారణ జైలు శిక్ష, రూ.3,000 జరిమానా విధిస్తు తీర్పు వెలువరించినట్లు పట్టణ సీఐ కె.కృష్ణ తెలిపారు.
వృద్ధుడిపై కోతుల దాడి
రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి ఇందిరమ్మ కాలనీలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం ఉదయం ఇంటి ఎదుట కూర్చున్న రసానంద్ అనే వృద్ధుడి ఒక్కసారిగా దాడి చేశాయి. ఎడమ కాలును కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. భయంతో వృద్ధుడు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. వారిరాకతో కోతులు పారిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment