అనర్హులకు ఆసరా!
● పింఛన్లపై విజిలెన్స్‌కు ఫిర్యాదు ● ఒక్క ఇల్లందకుంటలోనే 1,000 మంది అనర్హులు? ● ఉమ్మడి జిల్లాలో ఎందరో? ● 500 మందిని గుర్తించిన అధికారులు ● నకిలీ సర్టిఫికెట్లపై డీఆర్‌డీఏ, సివిల్ ఆస్పత్రి పరస్పర ఆరోపణలు ● రెండేళ్ల కిందే బయటపెట్టిన ‘సాక్షి’ ● విచారణ పక్కనబెట్టిన ఏసీబీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్●:
దివ్యాంగులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. ముఖ్యంగా నకిలీ సదరం సర్టిఫికెట్లు చూపి, నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ తీసుకుంటున్న విషయం కరీంనగర్ జిల్లాలో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒక్క ఇల్లందకుంట మండలంలోనే 1,000 మంది వరకు అనర్హులున్నట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా వారి సదరం సర్టిఫికెట్లపై విజిలెన్స్ అధికారులు అత్యంత రహస్యంగా విచారణ చేపట్టారు. ఈ విషయంలో తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి చాలామంది అనర్హులు అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు పొందినట్లు తేల్చారు. ఇల్లందకుంటలో ఇప్పటివరకు 500 మందిని గుర్తించారు. వీరంతా ఇప్పటికీ ఆసరా పింఛన్ పొందుతున్నట్లు తెలిసింది.
మిగిలిన వారెక్కడ?
ఇల్లందకుంటలో దాదాపు మరో 500 మందిని విజిలెన్స్ అధికారులు గుర్తించలేకపోతున్నారు. వారంతా ఎవరు? ఎక్కడున్నారు? సర్టిఫికెట్లు ఎవరు జారీ చేశారు? అన్న విషయాలపై తర్జనభర్జన పడుతున్నారు. మొత్తానికి నానా ఇబ్బందులు పడి, లోతుగా దర్యాప్తు చేస్తే.. కేవలం 70 సర్టిఫికెట్ల లబ్ధిదారులు, వారి సమాచారం పూర్తిస్థాయిలో రీ వెరిఫై చేయించగలిగారు. 2011 నుంచి ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన డాక్టర్లు 15 మందిని విచారణకు పిలిచారు. వీరంతా కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో విధులు నిర్వహించినవారే. ఇప్పుడు రిటైరయ్యారు. ఏ కారణం చేత జారీ చేశారో.. ఏ సమయంలో ఇచ్చారో.. అన్న విషయాలు వారికి గుర్తు లేకపోవడం గమనార్హం. దీంతో విజిలెన్స్ అధికారుల దర్యాప్తుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు మిగతా 500 మంది కోసం గాలిస్తున్నారు. ఈ విషయంలో ఇటు డీఆర్‌డీఏ, అటు సివిల్ ఆస్పత్రి అధికారులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. జరిగిన వ్యవహారంలో తమ తప్పు లేదంటే తమ తప్పు లేదంటూ తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘సాక్షి’లో వరుస కథనాలు..
సదరం నకిలీ సర్టిఫికెట్ల విషయంలో ‘సాక్షి’ దినపత్రిక 2022లోనే వరుస కథనాలు రాసింది. అప్పుడు కూడా జమ్మికుంటకు చెందిన ఓ విజిల్ బ్లోయర్(కుంభకోణాన్ని వెలికితీసిన వ్యక్తి) ద్వారా విషయం వెలుగుచూసింది. ఆ తర్వాత 317 జీవో అమలు సమయంలోనూ కలెక్టరేట్ కేంద్రంగా జరిగిన బదిలీల్లోనూ అనేక నకిలీ సర్టిఫికెట్లను అధికారులే పక్కనబెట్టారు. కానీ, అప్పటికే చాలామంది వాటి ఆధారంగా కోరుకున్న చోటకు బదిలీ చేయించుకోవడం, లేదా బదిలీ నిలిపివేయించుకోవడం ద్వారా లబ్ధి పొందారు. అనంతరం విచారణను ఏసీబీ చేపట్టింది. సివిల్ ఆస్పత్రి, డీఆర్‌డీఏ సిబ్బందిని విచారించింది. పలు ఆధారాలు సేకరించింది. ఆరంభంలో దూకుడుగా కనిపించిన సంబంధిత అధికారులు ఆ తర్వాత చల్లబడ్డారు. కొంతకాలానికి విచారణను పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ, దీనికి సంబంధించిన సమస్త సమాచారం కరీంనగర్ ఏసీబీ వద్ద ఉంది. అయితే, విజిలెన్స్ అధికారులు ఏసీబీని సంప్రదించారా లేదా అన్నది సందేహమే. ఇది కేవలం ఇల్లందకుంట మండలానికే పరిమితమైన సమస్య కాదు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా 2011 నుంచి జరుగుతున్న వ్యవహారం. దర్యాప్తు పూర్తయితే ఎన్ని కొత్త కోణాలు బయటపడతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment