పోటెత్తిన సన్నాలు
● బోనస్ వర్తింపజేయడమే ప్రధాన కారణం ● తుది దశకు చేరుకున్న ధాన్యం కొనుగోళ్లు ● మొత్తం 2.66 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరణ ● రైతుల ఖాతాల్లో రూ.63.51 కోట్ల బోనస్ జమ ● జిల్లావ్యాప్తంగా 18,962 మంది రైతులకు చెల్లింపులు
సాక్షి, పెద్దపల్లి: ఏటా అన్నదాతల నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోల మధ్య ధాన్యం సేకరణ సాగేది. ఈ వానాకాలంలో అలాంటి అవరోధాలకు తావులేకుండా కొనుగోళ్లు సాఫీగా సాగాయి. సన్న వడ్లు క్వింటాలుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించటం, అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించడం, తరుగు పేరిట కోతలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని అధికారులు వివరిస్తున్నారు. దసరా పండుగ అనంతరం వరి కోతలు ప్రారంభం కాగా.. దీపావళి పండుగ నాటికి జోరందుకున్నాయి. మధ్యలో కొన్నిసార్లు అకాల వర్షాలతో రైతులు కొన్ని ఇబ్బందులు పడ్డారు. అయితే, ధాన్యంలో కోతలకు తావులేకుండా చర్యలు తీసుకోవడంతో రెండుమూడ్రోరోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. మరోవారం పదిరోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పలువురు వ్యాపారులు కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేసినా.. సన్నాలకు బోనస్ వర్తిస్తుండడంతో కొనుగోలు కేంద్రాలకే రికార్డుస్థాయిలో సన్నవడ్లు వచ్చి చేరుతున్నాయి.
రూ.63 కోట్ల బోనస్ జమ..
గతేడాది వానాకాలం సీజన్‌లో మొత్తం 1.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది ఈ సీజన్‌లో 321 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచే చేసి 47,209 మంది రైతుల నుంచి ఇప్పటివరకు రూ.617 కోట్ల విలువైన 2.66లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మంథని పరిధిలో ఇంకా 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 29,809 మంది రైతుల నుంచి రూ.94.55 కోట్ల విలువైన సన్నరకం ధాన్యం సేకరించగా, అందులో 18,962 మంది రైతులకు రూ.63.51 కోట్ల బోనస్ చెల్లించారు. మరో 1,0847 మంది రైతుల ఖాతాల్లో రూ.31.04 కోట్లు జమ చేయాల్సి ఉంది.
వేగవంతంగా వివరాల నమోదు
గతంలో తరుగు పేరిట రైస్‌మిల్లుల్లో ట్రక్‌షీట్లు ఇవ్వడంలో జాప్యమైంది. దీంతో ట్యాబ్‌లలో వివరాలు నమోదు చేయడం ఆలస్యమయ్యేది. దీంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో వారం, పదిరోజులు గడిస్తేనే.. డబ్బు జమయ్యేది. ఈసారి కోతలు లేవు, రైస్ మిల్లర్లు లారీల్లోంచి ధాన్యం వెనువెంటనే అన్‌లోడ్ చేసుకోవడం, ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు సివిల్ సప్లయ్ పోర్టల్‌లో ట్యాబ్‌లతో నమోదు చేయడంతో కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని పరిశీలించి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ ప్రభుత్వానికి విక్రయించిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలని నివేదికలు పంపిస్తున్నారు. దీంతో రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సన్న, దొడ్డురకం వడ్లు కలుపుకొని 44,225 మంది రైతులకు రూ.581.55కోట్ల మేరకు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సమాచారం
ఏర్పాటు చేసిన కేంద్రాలు 321
మూసివేసినవి 106
ధాన్యం విక్రయించిన రైతులు 47,209
కొనుగోలు చేసిన ధాన్యం
(మెట్రిక్ టన్నుల్లో) 2,66,280
ధాన్యం విలువ(రూ.కోట్లలో) 617.72
కొనుగోలు చేసిన దొడ్డురకం
(మెట్రిక్ టన్నుల్లో) 63,267.75
కొనుగోలు చేసిన సన్నరకం
(మెట్రిక్ టన్నులు) 2,03,012.80
తుదిశకు కొనుగోళ్లు
జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు తుదిదశకు చేరాయి. వచ్చిన వడ్లను వచ్చినట్లే తూకం వేయడంతో కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయి. ట్యాబ్‌లో వివరాలు నమోదు చేశాక రెండు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేస్తున్నాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్‌మిల్లుల్లోకి తరలిస్తున్నాం. రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతీ ధాన్యపు గింజను పకడ్బందీగా కొనుగోలు చేస్తున్నాం.
– శ్రీకాంత్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment