ఉత్తమ రైతు మల్లారెడ్డి
● డ్రమ్‌సీడర్ ద్వారా వరి సాగులో ఆదర్శం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన ఎర్రం మల్లారెడ్డి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో శుక్రవారం డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నుంచి మల్లారెడ్డి ఉత్తమ రైతు అవార్డు అందుకునన్నారు. 2012 నుంచి మల్లారెడ్డి డ్రమ్‌సీడర్ ద్వారా వరి సాగు చేస్తున్నారు.
నూతన వంగడాలతో ప్రోత్సహిస్తూ..
తన అనుభవాలు, సాగు పద్ధతుల గురించి స్థానికులతోపాటు పొరుగున ఉన్న కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల రైతులకు అవగాహన కల్పించడంతోపాటు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆరు పరిశోధన కేంద్రాల నుంచి వివిధ రకాలైన వరి విత్తనాలు తీసుకొచ్చి సాగు చేసి అభివృద్ధి చేస్తున్నారు మల్లారెడ్డి. చీడపీడలను తట్టుకునే వరి వంగడాలను రైతులకు అందిస్తూ అధిక దిగుబడి సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. నువ్వు, ఆకుకూరలు, బంతిపూలు, కూరగాయలూ సాగుచేస్తూ అధిక ఆదాయం గడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఫార్మర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో సుమారు 300 మంది రైతులను భాగస్వాములను చేశారు. అధిగబడి ఇచ్చే కూరగాయల విత్తనాలు, వరి వంగడాలను రాయితీపై అన్నదాతలకు అందజేస్తున్నారు. రైతు మల్లారెడ్డి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయనను ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించింది. రైతులు, గ్రామస్తులు తదితరులు ఆయనను అభినందించారు. అవార్డుకు నామినేటు చేసిన కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ సిద్ది శ్రీధర్, ప్రభుత్వానికి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment