● రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడి
గోదావరిఖని: నేరాల నియంత్రణకు మెరుగైన ప్రొయాక్టివ్ పోలీసింగ్ నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. కమిషరేట్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్ల అదికారులతో కమిషనరేట్ నుంచి శుక్రవారం ఆన్‌లైన్ జూమ్ మీటింగ్‌లో వార్షిక నేర సమీక్ష నిర్వహించారు. డీసీపీ, ఏసీపీ, సీఐ స్థాయి అధికారులు సమీక్షించి ప్రతీ కేసును త్వరగా పరిష్కరించాలని సీపీ సూచించారు. విచారణలోని కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు విజబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్‌తోపాటు, ఆకస్మిక వాహన తనిఖీలు చేయాలని, సాంకేతిక వ్యవస్థ కూడా వినియోగించుకోవాలని అన్నారు. అధికారులు పనితీరు ఆధారంగా వచ్చే ఏడాది నుంచి గ్రేడింగ్ ఇస్తామని ఆయన తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే రౌడీలు, అసాంఘిక శక్తులు, మావోయిస్టులపై దృష్టి కేంద్రీకరించాలని, డయల్ 100కు వచ్చే కాల్స్‌పై తొందరగా స్పందించాలని చెప్పారు. గంజాయి, పేకాట, పీడీఎస్ రైస్, గుడుంబా, వైట్ కాలర్ తదితర నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. భూతగాదాలు, సివిల్ కేసుల్లో ఎస్‌వోపీ ప్రకారం పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment