అభివృద్ధికి అందరూ సహకరించాలి
కోల్‌సిటీ(రామగుండం): నగరంలో జరుగుతున్న అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్, నగరపాలక ఎఫ్‌ఏసీ కమిషనర్ జె.అరుణశ్రీతో కలిసి రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని సప్తగిరికాలనీ, ఐబీకాలనీలో టీయూఎఫ్‌ఐటీడీసీ నిధులు రూ.2.50 కోట్లతో చేపట్టనున్న సీసీరోడ్డు, కల్వర్టు, వరదనీటి కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సప్తగిరికాలనీ మరోసారి ముంపునకు గురికాకుండా వరదనీటి కాల్వ నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. ఏడాది కాలంలో నియోజకవర్గంలో దాదాపు రూ.300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. మరో రూ.200 కోట్ల నిధులకు సంబంధించి పనులు టెండర్ దశలో ఉన్నాయని వివరించారు. సుమారు రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో రామగుండంలో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, 25 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన రామగుండంను అభివృద్ధి పథంలో నడిపించి పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బాల రాజ్‌కుమార్, ఎస్‌ఈ శివానంద్, ఈఈ రామన్, డీఈ హనుమంత్‌నాయక్, ఏఈలు చంద్రమౌళి, మీర్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment