పట్టణ రూపురేఖలు మార్చుతా
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణ రూపురేఖలు మార్చుతానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పూసాల రోడ్డులో చేపట్టిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు విగ్రహ ఏర్పాటు స్థలాన్ని ఆయన శనివారం పరిశీలించి మాట్లాడారు. పదేళ్లుగా పట్టణం అభివృద్ధి చెందలేదని, తాను పూర్వవైభవం తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే వివరించారు. ఎ మ్మెల్యే విజయరమణారావుతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను మూడు నెలల్లో పూర్తిచేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, గాజుల లక్ష్మి, మినుపాల ప్రకాశ్‌రావు, బిరుదు సమత, వేగోళం అబ్బయ్యగౌడ్, చిలుక సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
నిర్భయంగా నాటు వేయండి
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దాపూర్ పెద్దచెరువు వద్ద ప్రారంభమయ్యే హుస్సేన్‌మియావాగు ద్వారా ఐదు మండలాలకు సాగునీరు అందుతుందని, ఈసారి ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటలకు సాగునీరు అందుతుందని, రైతులు నిర్భయంగా వరి నాట్లు వేసుకోవాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. పెదపూర్ పెద్ద చెరువు మత్తడి, నీటినిల్వలు, హుస్సేన్‌మియావాగు పరిసరాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. కాకతీయ కాలువపై రెవెల్లి వద్ద ఉన్న క్రాస్ రెగ్యూలెటరీ డిస్ట్రిబ్యూషన్ నుంచి పెద్దచెరువును నింపి జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెప్పారు. నాయకులు గండు సంజీవ్, కొమ్మ పోచాలు, వేణుగోపారావు, బొజ్జ శ్రీనివాస్, జక్కని శంకరయ్య, బండి స్వామి, సిరికొండ కొమురయ్య, చెరుకు కనుకయ్య, పెసరు స్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment