పట్టా చేసుకొని.. విక్రయించి!
● ప్రభుత్వ భూమి కావడంతోనే అమ్మేసిన వైనం●
● తప్పించుకునేందుకు సర్వేయర్ తిప్పలు
● చర్యలకు వెనుకడుగు వేస్తున్న అధికారులు
చందుర్తి(వేములవాడ): ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన భూమిని అక్రమంగా పట్టా చేయించుకుని.. తీరా విక్రియించేశాడు. ఇటీవల జిల్లాలో జరుగుతున్న పరిణామాలతో తనకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో తప్పించుకునేందుకు తిప్పలు పడుతున్నట్లు తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాలు. చందుర్తి మండలం బండపల్లికి చెందిన మామిడి ముత్తవ్వకు 511 సర్వేనంబర్‌లో 3.07 ఎకరాలు ఉండేది. ఊర చెరువును రిజర్వాయర్‌గా నిర్మించగా ఇందులో నుంచి 2.11 ఎకరాలు ముంపునకు గురైంది. మిగతా 36 గుంటలను సర్వేయర్‌గా పనిచేస్తున్న బోయినపల్లికి చెందిన వ్యక్తి రూ.22లక్షలకు కొనుగోలు చేశాడు. ఆ భూమితో పాటు ముంపునకు గురైన 2.11 ఎకరాలలో 2.10 ఎకరాలను గతంలో ఉన్న తహసీల్దార్ సహకారంతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో సదరు వ్యక్తిపై 1.23 ఎకరాలు, అతని భార్య పేరిట 1.23 ఎకరాలు పట్టా అయ్యాయి. ఆ భూమిపై ఐదేళ్లుగా రైతుబంధు పొందారు. అయితే ఇటీవల జిల్లాలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన పలువురిపై కేసులు నమోదవుతుండడంతో తేరుకున్న సదరు వ్యక్తి ఇదే మండలంలోని కిష్టంపేటకు చెందిన ఓ రైతుకు ఆ 36 గుంటల భూమి విక్రయించినట్లు తెలిసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన భూమిని అక్రమంగా పట్టా చేసుకుని ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన సదరు సర్వేయర్‌పై చర్యలకు రెవెన్యూ అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కార్యాలయానికే పరిమితమైన అధికారులు
ప్రాజెక్టులు, కాలువల నిర్మాణంలో మండలంలో 1,609 ఎకరాలను రైతులు కోల్పోయారు. ఇందులో సగానికిపైగా భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టాలెక్కించుకుని, విక్రయించిన రైతులు ఉన్నారని మండలంలో చర్చ సాగుతోంది. భూమి ని సేకరించిన భూసేకరణ అధికారులు కార్యాలయానికి పరిమితం కావడంతోనే సగానికి పైగా పట్టాలెక్కడంతోపాటు విక్రయాలు జరిగాయని రెవెన్యూ అధికారులే చర్చించుకుంటున్నారు.
బండపల్లిలో సర్వేయర్ సాగు చేస్తున్న రిజర్వాయర్‌లో ముంపునకు గురైన భూమి ఇదే
ఆ భూమిని రికార్డుల నుంచి తొలగించాం
మండలంలో కాలువ నిర్మాణం, రిజర్వాయర్, పైపులైన్ పనుల్లో భూమిని కోల్పోయి పరిహారం పొందిన భూములను గుర్తించి రికార్డుల నుంచి తొలగిస్తున్నాం. బండపల్లిలో సర్వేయర్ కొనుగోలు చేసిన భూమిని వారం క్రితమే రికార్డుల్లో నుంచి 2.10 ఎకరాల భూమిని తొలగించాం.
– శ్రీనివాస్, తహసీల్దార్, చందుర్తి
Comments
Please login to add a commentAdd a comment