ఖాళీస్థలం బస్ డిపోకు..
● ఎంపీడీవో కార్యాలయ భవనం కూల్చివేతకు నిర్ణయం ● సుమారు 50ఏళ్ల తర్వాత కనుమరుగుకానున్న భవనం ● ప్రభుత్వ ఐటీఐలోకి తరలింపు .. అక్కడికే ఎంఈవో ఆఫీసు కూడా ● భవిత కేంద్రం.. ఎకై ్సజ్ ఆఫీసులు కూడా తరలింపు ● మరో రెండు, మూడ్రోజుల్లో కూల్చివేత ప్రక్రియ ప్రారంభం ● ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటుకు చకచకా సాగుతున్న పనులు
జెడ్పీ కార్యాలయానికి..
జిల్లాగా అవతరించాక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం అవసరమైంది, దీనికోసం పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలోని గదులు కేటాయించారు. తొలిజెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించిన పుట్ట మధుకర్, జెడ్పీ సీఈవోలు ఈ భవనాన్ని వినియోగించారు. సమీపంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలోని ఇరుకు గదుల్లో సిబ్బంది ఇబ్బందిగానే విధులు నిర్వహిస్తున్నారు. జెడ్పీటీసీల పదవీకాలం ముగిసిన తర్వాత కలెక్టర్ ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో జెడ్పీ చైర్మన్, జెడ్పీ సీఈవోలు వినియోగించిన భవనాన్ని ఖాళీ చేయించి తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించారు. దీంతో సీఈవో కూడా రిటైర్డ్ ఉద్యోగుల భవనంలోనే ఓ పక్కన కూర్చుంటున్నారు. మళ్లీ జిల్లా ప్రజా పరిషత్ పాలక మండలి ఎన్నికై తే కొత్త చైర్మన్ కోసం గది ఎక్కడ కేటాయిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాన్ని ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో నిర్మించాలని తొలుత భావించినా.. అనూహ్యంగా ఇపుడు బస్‌డిపో ఏర్పాటుకు బదలాయించడంతో జిల్లా పరిషత్ ఆఫీసు ఏర్పాటుకు భవనం ఎక్కడనేది ప్రశ్నార్థకంగానే మారింది.
పెద్దపల్లిరూరల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పెద్దపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతోపాటు డివిజన్ కేంద్రంగానూ సేవలు అందిస్తోంది. అందుకే ఇక్కడ అనేక ప్రభుత్వ కార్యాలయ భవనాలు ఉన్నాయి. ఇందులో ఎంపీడీవో కార్యాలయ భవనం ఒకటి. దీనిని దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించారు. జీవితకాలం మరికొంత ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నా.. అంతకన్నా ముందుగానే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ బస్‌స్టాండ్‌ను ఆనుకుని ఇది ఉంది. ఎంపీడీవో కార్యాలయ భవ నం నిర్మించిన స్థలంతోపాటు ఖాళీ స్థలాన్ని ఆర్టీసీ బస్‌డిపో ఏర్పాటుకు కేటాయించారు. ఇటీవలే పెద్దపల్లికి బస్ డిపో మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల విద్యాధికారి, మహిళా సమాఖ్య, భవిత కేంద్రాలు, జిల్లా ఎకై ్సజ్ శాఖ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ తరలించి ఆయా భవనాలను కూడా కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
అప్పటి సీఎం ప్రారంభించిన భవనం..
పెద్దపల్లిలో సుమారు 50 ఏళ్లక్రితం అప్పటి పంచాయతీ సమితి కోసం నిర్మించిన ప్రస్తుత ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 13 మార్చి 1974న ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ బస్‌స్టాండ్‌ను ఆనుకుని ఉన్న ఈ కార్యాలయాన్ని కూల్చి వేసి.. ఆ స్థలంలో బస్ డిపో ఏర్పాటు చేస్తే బస్టాండ్‌కు అనుసంధానంగా, సమీపంలో ఉంటుందని భావించిన ఎమ్మెల్యే విజయరమణారావు.. అధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం బస్‌డిపో మంజూరు చేయడంతో ఇందులోని కార్యాలయాల తరలించి భవనాలు కూల్చివేసే పనులు రెండు, మూడ్రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఐటీఐలోకి ఎంపీడీవో ఆఫీసు..
స్థానిక ప్రభుత్వ ఐటీఐ ఆవరణలోని మూడు గదులను ఎంపీడీవో కార్యాలయ కార్యకలాపాల నిర్వహణ కోసం తాత్కాలికంగా కేటాయించారని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే సామగ్రిని ఆ గదుల్లోకి తరలించారు. ఇదే ఆవరణలోకి మండల మహిళా సమాఖ్య కూడా తరలిపోనుంది. అలాగే జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోని ఓ గదిలోకి మార్చనున్నారు. మండల విద్యాధికారి కార్యాలయాన్ని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని ఓ గదిలోకి మార్చుతున్నట్లు విద్యాశాఖ సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment