కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పోటీ.. రెండో స్థానం కోసమే!: కిషన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పోటీ.. రెండో స్థానం కోసమే!: కిషన్‌రెడ్డి

Published Sun, May 5 2024 5:34 AM

BJP Leader Kishan Reddy Comments On Congress BRS

తెలంగాణలో బీజేపీకే సానుకూల వాతావరణం 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హామీలు అమలు చేయలేకనే.. రేవంత్‌ దుష్ఫ్రచారాలు.. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, గాడిద గుడ్డు అంటూ మాట్లాడుతున్నారు 

ప్రధాని స్పష్టత ఇచ్చినా.. బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు 

దేవుడిపై ఒట్లు పెడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారు 

నోటికొచ్చిన హామీలివ్వడం కాదు.. రేవంత్‌కు ముందుంది ముసళ్ల పండుగ

కె.రాహుల్‌
తెలంగాణలో బీజేపీకి పోటీయే లేదని.. రెండో స్థానం కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ తేల్చుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో చాలా వరకు బీజేపీ–కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని.. అక్కడక్కడా బీఆర్‌ఎస్‌ తమతో తలపడాల్సి రావచ్చునని వ్యాఖ్యానించారు. 

గ్యారంటీలను, హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో చెప్పుకోవడానికి రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌ పార్టీకి ఏమీ లేకనే.. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడిపై ఒట్లు పెడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ నెల 13న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఉన్న నేపథ్యంలో కిషన్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, ప్రచార పర్వం, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూలోని కీలక అంశాలు ఆయన మాటల్లోనే.. 

బీజేపీకే అనుకూల వాతావరణం 
తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంది. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అసెంబ్లీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోకపోవడంతో అధికార కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు బీఆర్‌ఎస్‌ను వెన్నాడుతున్నాయి. దీంతో మోదీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో 12 స్థానాలకు మించి వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. 

మేం కచ్చితమైన ఎన్నికల కార్యాచరణతో ముందుకెళుతున్నాం. రాష్ట్రంలోని ఒక్కో ఎంపీ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కమిటీలు, టీమ్‌లు ఏర్పాటు చేశాం. నాయకులంతా సమన్వయంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులను ఒక్కో అసెంబ్లీకి పంపించాం. ఇవి లోక్‌సభ ఎన్నికలు కాబట్టి ఇంకా ఏ పార్టీ, ఎంపీ అభ్యర్థులు కూడా పోలింగ్‌బూత్‌ స్థాయి వరకు చేరుకోలేదు. మేం మాత్రం కచ్చితమైన ప్రణాళికతో బూత్‌ స్థాయి వరకు ఓటర్లను చేరుకున్నాం. 

బీజేపీ బలాన్ని పెంచుకుంటున్నాం.. 
హైదరాబాద్‌ నుంచి బరిలో ఉన్న మాధవీలత, ఖమ్మం నుంచి పోటీచేస్తున్న వినోద్‌రావు బీజేపీలో ఉన్నవారే, ప్రజాసంఘాల్లో పనిచేస్తున్నవారే. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకునేందుకు కొన్ని సీట్లలో ఇతర పార్టీల వారికి, బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాం. తెలంగాణలో బీజేపీ ఇంకా చిన్న పార్టీ. పెరగాల్సిన అవసరం ఉంది. 

సంకీర్ణమైతే దేశం ష్టుపడుతుంది 
రాబోయేది సంకీర్ణ యుగమంటూ మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్‌ సంకీర్ణంలో చేరుతారా? సమాధానం చెప్పాలి. మేం మాత్రం ఆయనను చేర్చుకునే ప్రసక్తే లేదు. సంకీర్ణమంటే దేశమైనా, రాష్ట్రమైనా ష్టుపడతాయన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎవరికి వారు బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. ఆ పరిస్థితి పట్ల ప్రజలు విసిగి వేసారాకే.. 2014లో, 2019లో బీజేపీకి మెజారిటీ కట్టబెట్టారు. ఎన్డీయేను అందలం ఎక్కించారు. 

ఈసారి గెలిచాక జమిలి ఎన్నికలే.. 
మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక.. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ (జమిలి ఎన్నికలు) విధానంతో ముందుకెళతాం. వచ్చే ఎన్నికలు కలిసే జరుగుతాయి. దేశంలో జనగణనతోపాటు నియోజకవర్గాల పునరి్వభజన జరగాల్సి ఉంది. ఇందులో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయంటూ దుష్ఫ్రచారం చేయడం ఎంతమాత్రం సరికాదు. 

సీఎం, మాజీ సీఎం స్థాయివాళ్లు దిగజారి మాట్లాడుతున్నారు! 
ప్రస్తుతం రాజకీయ వాతావరణమంతా కలుషితమై పోయింది. గతంలో ఎన్నికలంటే గ్రామాల్లో పండుగ వాతావరణం ఉండేది. ఇప్పుడు అసహ్యించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏ మాత్రం సంబంధం లేని విషయాలు ప్రస్తావించడం, అబద్ధాలు మాట్లాడటం, ఉపయోగించే భాషపై నియంత్రణ లేకపోవడం పెరిగింది. కొడతా, తిడుతా, చంపుతా, పాదాల కింద నలిపేస్తా అంటూ సీఎం, మాజీ సీఎం స్థాయిల వ్యక్తులు మాట్లాడుతున్నారు. ప్రచారంలో, మాట్లాడే మాటల్లో నైతికత లేకుండా పోయింది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం సహా అన్నిచోట్లా డబ్బులే కీలకపాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది. 

రాముడి పేరిట కాదు.. అభివృద్ధిని చూపి వస్తున్నాం 
బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా రాముడి ప్రస్తావన ఉందా? మీడియా, వార్తాపత్రికల్లో దీని ప్రాతిపదికన ఎక్కడైనా ఓట్లు అడిగామా? పదేళ్లలో మేం ఎంత అభివృద్ధి చేశాం, ఏయే రంగానికి ఎన్నెన్ని నిధులిచ్చామో స్పష్టంగా చెప్పి ఓట్లు అడుగుతున్నాం. ఎంత మందికి బియ్యం ఇస్తున్నాం, రైతులకు ఏం చేశామనేది చెప్తున్నాం. మేం రాముడి పేరిట ఓట్లు అడుగుతున్నామని విమర్శిస్తున్న వారు దీనికి సమాధానం చెప్పాలి. 

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి 
దేశంలో సుస్థిర ప్రభుత్వం రావడం ద్వారా అవినీతి, అక్రమాలకు చెక్‌పెట్టవచ్చు. ఉగ్రవాదాన్ని అరికట్టవచ్చు. అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఎంతో మేలు జరిగింది. ఇక ముందు మరింత అభివృద్ధి జరగాలంటే బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపించాలని కోరుతున్నాను. 

రేవంత్‌కు ముందుంది ముసళ్ల పండుగ 
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయలేదు. అందుకే కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి ఓట్లు అడిగే నైతికహక్కు లేదంటున్నాం. మా ఇంటింటి ప్రచారంలో ఈ విషయాన్ని ప్రజలకు చెప్తుంటే మంచి స్పందన వస్తోంది. రేవంత్‌రెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ. 

ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలు ఎలా చేస్తారు? ఇప్పుడు తొందరపడి ఎగిరెగిరి పడితే సరిపోతుందా? భూములు అమ్మి ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు? ఏం చేస్తారనేది ప్రజల ముందు ఉంది. కాంగ్రెస్‌ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మరీ దారుణంగా వ్యవహరిస్తోంది. 

రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్‌ గోబెల్స్‌ ప్రచారం 
ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని మేం 20 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం. అది మా పార్టీ విధానమని స్పష్టంగా చెప్తున్నాం. మోదీ ప్రధాని అయ్యాక కొత్తగా ఏమీ దీనిని లేవనెత్తలేదు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులు కూడా తీర్పులిచ్చాయి. కానీ విపక్షాలు కావాలని బురద చల్లుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి పెద్ద ఎత్తున గోబెల్స్‌ ప్రచారానికి దిగాయి. దీనిపై ప్రధాని మోదీ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. 

తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్ల రద్దు ఉండదని, రాజ్యాంగాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. అయినా బీజేపీపై దుష్ఫ్రచారాన్ని కొనసాగిస్తూ.. దాన్ని ఎన్నికల ఎజెండాగా తయారుచేసి పెట్టారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మేం పదే పదే వివరణ ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నాయి. ఇది మాదిగలకు అనుకూలం, మాలలకు వ్యతిరేకమనే ఆలోచన తప్పు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఫలాలు అందాలని కోరుకుంటున్నాం.   

Advertisement
 
Advertisement