నాడు మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారా? : కేటీఆర్‌ | BRS Leader KTR Fires On Congress Leaders Over MLC Kavitha Bail, More Details Inside | Sakshi
Sakshi News home page

నాడు మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారా? : కేటీఆర్‌

Published Thu, Aug 29 2024 6:27 AM | Last Updated on Thu, Aug 29 2024 10:31 AM

BRS Leader KTR Fires On Congress Leaders

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీతో కుమ్మక్కైనందుకే ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ వచ్చినట్టయితే.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో 2015 డిసెంబర్‌లో సోనియా గాందీ, రాహుల్‌ గాందీలకు కూడా అలాగే వచ్చిందా? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కూడా ఎన్డీయేతో కుమ్మక్కు అయినందుకే వారిద్దరికి బెయిల్‌ వచ్చిందని భావించాల్సి వస్తుందని కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

కాంగ్రెస్‌ నేతలు పనిమాలిన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియా కూటమిలో భాగమైన ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియాకు కూడా వారం క్రితమే బెయిల్‌ వచ్చిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌ రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారన్న సంగతి కాంగ్రెస్‌ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇవన్నీ కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయని, వీరంతా ఎన్డీయే భాగస్వాములేనని అనుకోవాలా? అని ప్రశ్నించారు.  

రాసి పెట్టుకో...  
సోనియా గాందీని దెయ్యం, పిశాచి, బలి దేవత అన్న రేవంత్‌రెడ్డి.. రాజీవ్‌ గాంధీ మీద ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలు రంగు ప్రజలకు తెలుసని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. దొడ్డిదారిన పీసీసీ అధ్యక్షుడై రాజీవ్‌గాంధీ పేరుతో నాటకాలు ఆడుతున్నారన్నారు. ‘నీ ఆలోచనల్లో కుసంస్కారం.. నీ మాటలు అష్ట వికారం’అని మండిపడ్డారు. 

‘తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్‌ నాయకుల విగ్రహాలేంటని అడిగితే కారుకూతలు కూస్తావా? తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది’అని అన్నారు. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తాం అని పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని మళ్లీ చెబుతున్నాం.. రాసి పెట్టుకో అని రేవంత్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తామని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement