సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా గ్రేటర్ పీఠంపై కాషాయ జెండాను ఎగరేసే దిశగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. 80 సీట్లకుపైగా గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని యోచిస్తుంది. ఇందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న అసమ్మతిని అవ కాశంగా మలుచుకుంటుంది. ఇప్పటికే రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లి అధికారపార్టీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి సహా, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరుడు మన్సూరాబాద్ మాజీ టీడీపీ కార్పొరేట్ కొప్పుల లత భర్త నర్సింహ్మారెడ్డి ఆ పార్టీలను వీడి బీజేపీలో చేరారు. తాజాగా మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి దంపతులు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్ కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం స్వయంగా భిక్షపతి యాదవ్ ఇంటికి వెళ్లి ఆయన్ను బుజ్జగించేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనేది స్పష్టమైంది. ఇక కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ కూడా ఆ పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉండడం చర్చనీయాంశమైంది.
ప్రతిష్టాత్మకం..
దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయంతో బీజేపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని, తద్వారా ఇటు అధికార టీఆర్‌ఎస్, అటు దానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంకు చెక్‌పెట్టాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌ను ఆరు జోన్లుగా విభజించింది. (హైదరాబాద్ సెంట్రల్, గోల్కొండ, భాగ్యనగర్, మహంకాళి, రంగారెడ్డి అర్బన్, మేడ్చల్ అర్బన్)గా విభజించింది. ఒక్కో జోన్ పరిధిలో రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మించకుండా చూసుకుంది. స్థానికంగా బలమైన సామాజిక వర్గం ఉన్న నేతలను గుర్తించి ఆ మేరకు వారికి పార్టీ పగ్గాలు అప్పగించింది. కాగా ఆశావహుల నుంచి ఒత్తిడి కూడా తీవ్రంగా ఉంది. అంబర్‌పేట్, ముషీరాబాద్, గోషామహల్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. టికెట్ల కోసం అగ్రనేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ముషీరాబాద్ డివిజన్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ క్యాంపు కార్యాలయం ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం గమనార్హం.
నియోజకవర్గ ఇన్‌చార్జిలు వీరే..
ఎల్బీనగర్– సంకినేని వెంకటేశ్వర్‌రావు, మహేశ్వరం– యెన్నం శ్రీనివాసరెడ్డి, రాజేంద్రనగర్– వన్నాల శ్రీరాములు, శేర్‌లింగంపల్లి– ధర్మపురి అరవింద్, ఉప్పల్–ధర్మారావు, మల్కజ్‌గిరి–రఘునందన్‌రావు, కుత్బుల్లాపూర్–చాడ సురేష్‌రెడ్డి, కూకట్‌పల్లి–పెద్దరెడ్డి, పటాన్‌చెరు–పొంగులేటి సుధాకర్‌రెడ్డి, అంబర్‌పేట్–రేవూరి ప్రకాష్‌రెడ్డి, ముషీరాబాద్–జితేందర్‌రెడ్డి, సికింద్రాబాద్–విజయరామారావు, కంటోన్మెంట్–శశిథర్‌రెడ్డి, సనత్‌నగర్–మోత్కుపల్లి నరసింహులు, జూబ్లిహిల్స్–ఎర్ర చంద్రశేఖర్, ఖైరతాబాద్– కటకం మృత్యుంజయ, నాంపల్లి– సోయం బాబురావు, చార్మినార్–కాసిపేట లింగయ్య, గోషామహల్–యెండల లక్ష్మీనారాయణ, కార్వాన్ బొడిగె శోభ, మలక్‌పేట్–విజయ్‌పాల్‌రెడ్డి, యాకుత్‌పుర–రామకృష్ణారెడ్డి, చాంద్రాయణగుట్ట–రవీంద్రనాయక్, బహదుర్‌పుర–సుద్దాల దేవయ్యలను ఇంఛార్జీ లుగా నియ మించింది.
కమలం గూటికి ప్రపుల్ రాంరెడ్డి
నేడు బీజేపీలో చేరనున్న రాంరెడ్డి దంపతులు
కవాడిగూడ: టీఆర్‌ఎస్ పార్టీ భోలక్‌పూర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు, విజన్ కేసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి, పద్మజారెడ్డి దంపతులు గురువారం భారతీయ జనతా పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పార్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె, ఓయూ విద్యార్థుల ఉద్యమం, మిలియన్ మార్చ్ వంటి అనేక పోరాటాలలో పాల్గొన్నారు. 2002లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భోలక్‌పూర్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రపుల్ రాంరెడ్డి పోటీ చేశారు. ఆయన గెలుపు కోసం కేసీఆర్ స్వయంగా వచ్చి రెండు రోజుల పాటు ప్రచారం చేయడం విశేషం. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనప్పటికీ రిజర్వేషన్‌లో భాగంగా బీసీకి వెళ్లడంతో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే పార్టీ అధిష్టానం, కేటీఆర్ సూచన మేరకు ముఠా గోపాల్ విజయానికి కృషి చేశారు. భార్య పద్మజ సైతం టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment