ప్రజాపాలన విజయోత్సవాల్లో నేటి నుంచి ‘గ్రాండ్ ఫినాలే’
7, 8, 9 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు.. డ్రోన్‌షో నిర్వహణ
చివరి రోజు సాయంత్రం లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఈనెల 9వ తేదీతో ముగియ నున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా చివరి మూడు రోజుల పాటు గ్రాండ్ ఫినాలే పేరుతో అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7వ తేదీ శనివారం ఉదయం హైదరాబాద్‌లో హోంశాఖ ఆధ్వర్యంలో విపత్తు స్పందన దళాన్ని ప్రారంభిస్తారు. పోలీస్ బ్యాండ్‌తో పాటు ఆయుధాలను ప్రదర్శించనున్నారు. నేరాల నియంత్రణ, యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్ స్టాళ్లను ప్రారంభిస్తారు. అదే సమయంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అత్యవసర స్పందన వాహనాలను కూడా ప్రారంభించనున్నారు.
అనంతరం సాయంత్రం గ్రాండ్ ఫినాలే కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. మూడు రోజుల పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మిరుమిట్లు గొలిపేలా వీధిలైట్లు, ట్యాంక్‌బండ్ సమీపంలో థాంక్యూ సెల్ఫీ పాయింట్లు, ఫుడ్ స్టాల్స్, హస్తకళల స్టాళ్లు, ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లాష్ మాబ్‌షోలు, కల్చరల్ షోలు, మ్యూజిక్ ఫెస్టివల్స్, ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మున్సిపల్‌శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు ఈ గ్రాండ్ ఫినాలే వేడుకలను సమన్వయం చేయనున్నాయి. రెండోరోజు 8వ తేదీ ఆదివారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన 7 స్టార్టప్‌లను ప్రారంభించనున్నారు. అదేవిధంగా 130 కొత్త మీ సేవ కేంద్రాలు ప్రారంభిస్తారు.
అదే రోజు 15 పరిశ్రమ లతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఏఐ సిటీలో మౌలికసదుపాయాల కల్పనకు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారు. ఇక, చివరి రోజు 9వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత సాయంత్రం సెక్రటేరియెట్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. లక్ష మంది స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళా సభ్యుల సమక్షంలో ఈ ఆవిష్కరణ జరగనుంది. అనంతరం సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నెక్లెస్‌రోడ్డులో బాణసంచా కాల్చడంతో పాటు డ్రోన్‌షో, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రాండ్ కార్నివాల్ నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment