పుల్లలచెరువు: మనస్పర్థల నేపథ్యంలో ఓ యువకుడు క్షణికావేశానికి లోనై కట్టుకున్న భార్యను కడతేర్చాడు. సాగర్ కాలువలోకి బైక్‌తో సహా భార్యను నెట్టి నీటిలో ముంచి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రమాదకర సంఘటనగా చిత్రీకరించాడు. ఈ సంఘటన పుల్లలచెరువు మండలంలోని మానేపల్లి వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకోగా.. మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన పూజల శ్రీను, కోటేశ్వరి(26) దంపతులు ఆసుపత్రికి వెళ్లి వస్తామని చెప్పి పిల్లలను ఇంటి వద్దే ఉంచి బైక్‌పై మేడపికి బయలుదేరారు. ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న తర్వాత తిరుగుప్రయాణమయ్యారు.
ఈ క్రమంలో సిద్దన్నపాలెం, మానేపల్లి, ఐటీవరం గ్రామాల వద్ద భార్యతో శ్రీను గొడవపడుతుండగా స్థానికులు వారించారు. అయితే మానేపల్లి వద్ద కాలువ కట్టపైకి రాగానే భార్య కోటేశ్వరితోపాటు తన ద్విచక్రవాహనాన్ని శ్రీను కాలువలోకి నెట్టాడు. భార్యకు ఊపిరాడకుండా నీటిలో ముంచి ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక తాపీగా బయటకొచ్చాడు. ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడు. కోటేశ్వరి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
శనివారం గల్లంతైన మహిళ మృతదేహాన్ని త్రిపురాంతకం మండలంలోని విశ్వనాథపురం సమీపంలో లాకుల వద్ద ఆదివారం గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై కోటయ్య పరిశీలించారు. కుటుంబ సభ్యుల సహాయంతో మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. కేసును సీఐ మారుతీకృష్ణ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైపాలెం తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment