రుణాలివ్వండి
లక్ష్యం మేరకు
● బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: బీసీ యాక్షన్ ప్లాన్ 2024–25 ఓబీఎంఎంఎస్ స్వయం ఉపాది పథకం కింద బ్యాంకులకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. మంగళవారం ప్రకాశం భవనంలో వెనుకబడిన తరగతుల సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బీసీ యాక్షన్‌ప్లాన్ స్వయం ఉపాధి పథకం అమలుపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి పథకంలో భాగంగా పేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు జిల్లాకు 1195 యూనిట్లతోపాటు ఆర్థికంగా వెనుకబడిన కులాలకు(ఈడబ్ల్యూఎస్) సంబంధించి 483 యూనిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు రూ.4 లక్షల సబ్సిడీ పోను బ్యాంకు రుణం రూ.4 లక్షలు ఇవ్వాలని చెప్పారు. బీసీ యాక్షన్ ప్లాన్ కింద 24, ఈడబ్ల్యూఎస్ కింద 85 జనరిక్ మెడికల్ షాపులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా 13 బ్యాంకులకు బ్రాంచ్‌ల వారీగా నిర్దేశించిన రుణ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, ఎల్‌డీఎం రమేష్, వివిధ బ్యాంకుల ప్రతినిదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment