సెలవులకే సెలవు !
● ఒక్క రోజు కూడా గైర్హాజరుకాని మాస్టారు ● ఆదర్శంగా నిలుస్తున్న సిరిసిల్ల హెచ్‌ఎం శ్రీనివాస్ ● నెటిజన్ల ప్రశంసల వర్షం
సిరిసిల్లకల్చరల్: విద్యార్థుల భవిష్యత్.. స్కూల్ బాగు కోసం ఆ ఉపాధ్యాయుడు కర్తవ్యదీక్షకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. 2024వ సంవత్సరంలో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా నిత్యం స్కూల్ వచ్చారు సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చకినాల శ్రీనివాస్. 2023లో ఒక్క రోజు మాత్రమే సెలవు పెట్టారు. సాధారణంగా ఉద్యోగులకు వేతనంలో కోత లేకుండా 15 సెలవులు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఆ సెలవులను సైతం హెచ్‌ఎం శ్రీనివాస్ ఉపయోగించుకోలేదు. ఈ విషయాన్ని తనే సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్ల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది.
విద్యార్థుల సంఖ్య పెరగడంలో..
2009లో ప్రస్తుతం పనిచేస్తున్న శివనగర్ స్కూల్‌లోనే ఎఫ్‌ఏసీ హెడ్‌మాస్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లారు. ఆ సమయంలో ఆ స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య 500 ఉండేది. మళ్లీ 2018లో హెడ్‌మాస్టర్ అదే పాఠశాలకు వచ్చారు. కానీ ఆ పాఠశాలలో శ్రీనివాస్ వెళ్లే సమయంలో 500 మంది ఉండగా.. తిరిగొచ్చే నాటికి 50 మాత్రమే మిగిలారు. దీన్ని చాలెంజ్‌గా తీసుకున్న శ్రీనివాస్.. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విశేష కృషి చేశారు. ప్రస్తుతం శివనగర్ ఉన్నత పాఠశాలలో 301 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు.. మొదట ఉపాధ్యాయులు సమయానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. నిర్ధేషిత టైమ్‌టేబుల్ ప్రకారం సబ్జెక్టుల బోధన, సిలబస్ పూర్తిచేయడం, బడికి వస్తున్న పిల్లల అభ్యసన స్థాయి పెంచడం వంటి వాటిలో విజయవంతమయ్యారు. వేసవిసెలవుల్లోనూ ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ పోటీల్లో విద్యార్థులను ప్రోత్సహించి మంచి ఫలితా లు సాధించారు. దీంతో తల్లిదండ్రులకు స్కూ ల్‌పైన, ఉపాధ్యాయులపైన విశ్వాసం పెరిగింది. విద్యార్థుల సంఖ్య 301 మందికి చేరారు. పాఠశాల పురోగతికి కృషిచేసిన శ్రీనివాస్‌ను రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించి ప్రభుత్వం పురస్కారాన్ని ప్రదానం చేసింది. అవార్డు స్ఫూర్తిగా మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు చొరవ తీసుకున్నారు. పూర్వ విద్యార్థుల సౌజన్యంతో విద్యార్థులకు సైకిళ్లు, బ్యాగులు, తాగునీటి వసతి కల్పించారు. గతేడాది పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఇలా ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సెలవులకే సెలవు పెట్టడంతోపాటు విద్యార్థులు ప్రగతిబాటలో పయణించేలా చర్యలు తీసుకొని శభాష్ అనిపించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment