చి‘వరి’కి పారేనా?
చెట్లు, ముళ్లపొదలు నిండిన ఈ కాల్వ సింగసముద్రం నుంచి వచ్చే బొప్పాపూర్–ఎల్లారెడ్డిపేట మధ్య ఉంది. కాల్వలపై పర్యవేక్షణ లేక ఇలా చెట్లు, ముళ్లపొదలు పెరిగిపోయాయి. నీటికి అడ్డుగా ముళ్లపొదలు, చెత్తాచెదారం ఉండడంతో ఒత్తిడి పెరిగి కాల్వలకు బుంగలు, గండ్లు పడుతున్నాయి. ఫలితంగా చివరి భూములకు నీరందడం లేదు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల రైతుల వరప్రదాయిని సింగసముద్రం ప్రధాన కాల్వలు చెట్లు, ముళ్లపొదలతో నిండిపోయాయి. కనెక్టింగ్(అనుసంధాన) కాల్వలు పూడికతో కుంచించుకుపోయాయి. ఫలితంగా ప్రధాన, అనుసంధాన కాల్వలకు గండ్లు పడుతున్నాయి. అక్కడక్కడ నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టులోనూ నీటి నిల్వ అంతంతే ఉంది. ఇప్పుడే పరిస్థితి ఇలాగే ఉంటే ఎండలు ముదిరితే పరిస్థితి ఏంటని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
2,200 ఎకరాల ఆయకట్టు
సింగసముద్రం పరిధిలోని నారాయణపూర్, రాచర్లబొప్పాపూర్, కోరుట్లపేట, సర్వాయిపల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో 2,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఎండాకాలం సీజన్‌లో పూర్తిస్థాయిలో నీరు అందకపోవచ్చనే ఆలోచనతో 1500 ఎకరాలకే తైబందీ నిర్ణయించారు. ఆమేరకు పంటలను సాగుచేశారు. కానీ కాల్వలకు తరచూ పడుతున్న గండ్లతో చివరి ఆయకట్టు భూములకు ఇప్పుడే నీరందడ లేదు. ఫలితంగా ఎల్లారెడ్డిపేట శివారులోని దాదాపు 23 ఎకరాల్లో వరిపంట ఎండిపోయింది.
అందని గోదావరి నీరు
కాళేశ్వరం 9వ ప్యాకేజీలో భాగంగా 2013లో సింగసముద్రంను అందులో కలిపారు. దీంతో మల్కపేట నుంచి సింగసముద్రం వరకు 18 కిలోమీటర్ల కాల్వపనులు చేశారు. కానీ అక్కడక్కడ పనులు పూర్తికాకపోవడంతో గోదావరి జలాలు సింగసముద్రానికి చేరడం లేదు. గోదావరి జలాలు సింగసముద్రానికి చేరి ఉంటే ఆయకట్టు పరిధిలోని 2200 ఎకరాలు సాగులోకి వచ్చేవి.
పంటలు ఎండిపోతున్నాయి
తైబందీ నిర్ణయించడంతో పూర్తి స్థాయిలో పంటలు చేతికొస్తాయనే ఆశతో నాకున్న మూడు ఎకరాల్లో వరి పంట వేసిన. కాల్వలకు గండ్లు పడి నీరు రావడం లేదు. కలుపు దశలోనే ఇలా ఉంటే పంట ఈనే సమయంలో సాగునీరు అందుతుందో.. లేదోననే అనుమానం ఉంది. అధికారులు స్పందించి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలి. – నూకల శ్రీనివాస్, రైతు, ఎల్లారెడ్డిపేట
మరమ్మతు పనులు చేపడతాం
ప్రస్తుతం పంటలు కలుపు దశలో ఉన్నాయి. ఈ సమయంలో తూములు, కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టలేం. ఈ సీజన్ ముగిసిన తర్వాత పనులు చేసే అవకాశం ఉంది. సింగసముద్రం నుంచి కాల్వ ప్రారంభమయ్య మొదట్లోనే తూము పనులు చేసే అవకాశం ఉంది. ఈ పనులు 9వ ప్యాకేజీ ఏజెన్సీ ద్వారా చేయాల్సి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం.
– మద్దుల వెంకట్‌రెడ్డి, నీటిపారుదలశాఖ, ఏఈ
చి‘వరి’కి పారేనా?
చి‘వరి’కి పారేనా?
చి‘వరి’కి పారేనా?
Comments
Please login to add a commentAdd a comment