మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
● ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ● రూ.కోటి విలువైన సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ
నారాయణఖేడ్/కల్హేర్(నారాయణఖేడ్): ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతీ ఒక్కరికీ మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 4, 9 వార్డుల్లో రూ.కోటితో నిర్మించనున్న సీసీ రోడ్లకు శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...రూ.20 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టగా 80 శాతం పూర్తయ్యాయన్నారు. రూ.15 కోట్లతో త్వరలో తాగునీటి పైపులైన్ల పనులు చేపడతామని తెలిపారు. ప్రజలు డీటీసీపీ నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవడంతోపాటు సెట్‌బ్యాక్, మొక్కల పెంపకం, మురుగుకాల్వల కోసం స్థలాలను వదలాలని సూచించారు. స్థలం కేటాయిస్తే లయన్స్‌క్లబ్ ద్వారా కంటి ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.
కంటి శిబిరం ప్రారంభం
ఖేడ్‌లో లయన్స్ క్లబ్ సౌజన్యంతో నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి శిబిరాన్ని సంజీవరెడ్డి ప్రారంభించారు. అంతకుముందు దామరచెర్వుకు చెందిన విఠయ్యకు అత్యవసర వైద్యం నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన రూ.2 లక్షలకు సంబంధించిన ఎల్‌ఓసీని ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఖేడ్‌లోని శ్రీషిర్డీసాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయకమిటీ సభ్యులు వీరయ్య, మాణిక్ ప్రభు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. నిజాంపేట్ మండలం మునిగేపల్లిలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ కుటుంబాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పరామర్శించి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారంశంకర్, కౌన్సిలర్లు రాజేశ్ చౌహాన్, హన్మాండ్లు, మాజీద్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment