దుబ్బాకలో నేడు మంత్రి కొండా సురేఖ పర్యటన
● నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు శ్రీకారం ● పాల్గొననున్న ఎమ్మెల్యే, ఎంపీ ● ఏం జరుగుతుందోనని సర్వత్రా చర్చ ● నాలుగు నెలల క్రితం మంత్రిపర్యటనలో తీవ్ర ఉద్రిక్తత ● సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్,కాంగ్రెస్, బీజేపీ నేతల హల్‌చల్
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ నియోజకవర్గంలో శనివారం పర్యటించనున్నారు. గతంలో జరిగిన రగడ నేపథ్యంలో మళ్లీ టెన్షన్ నెలకొంది. గత ఏడాది సెప్టెంబర్ 26న దుబ్బాకలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్, చేనేతల నూలుపోగుల దండ వేయడంపై తీవ్ర దుమారాన్ని రేపిన విషయం విదితమే. నియోజకవర్గంలో ఏడాది కాలంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టాలన్నా అధికారులకు తీవ్ర తలనొప్పిగా తయారైంది. నియోజకవర్గంలో మళ్లీ మంత్రి పర్యటన నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న చర్చ సర్వత్రా నెలకొంది.
– దుబ్బాక
దుబ్బాక నియోజకవర్గంలో శనివారం మంత్రి కొండా సురేఖ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయను న్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఎవరికి వారు భారీగా తరలిరావాలంటూ జోరుగా ప్రచారం చేశారు. మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలంటూ కాంగ్రెస్ నాయకులు.. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తారంటూ బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బీజేపీ నాయకులు సైతం పాల్గొనాలంటూ ఎంపీ రఘునందన్‌రావు సైతం తమ క్యాడర్‌కు పిలుపు నివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పాల్గొనే కార్యక్రమాల ఏర్పాట్లను శుక్రవారం కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించగా బీఆర్‌ఎస్ నాయకులు సైతం పరిశీలించారు.
మంత్రి పర్యటన ఇలా..
మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ మాధవనేని రఘునందన్‌రావులు దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారని అధికారులు వెల్లడించారు. ఉదయం 8.30 గంటలకు మంత్రి నగరం నుంచి బయలుదేరుతారు. చేగుంటలో 10 గంటలకు జరిగే కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో పొల్గొంటారు. అనంతరం గొల్లపల్లిలో 11.15కు 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 12 గంటలకు దౌల్తాబాద్‌లో మోడల్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం భూంపల్లికి చేరుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 1.30కి దుబ్బాక పట్టణంలోని చిల్డ్రెన్స్ పార్క్‌తో పాటు ఎఫ్‌ఎస్‌టీపీ కేంద్రం ప్రారంభించనున్నారు. భోజనం తర్వాత 2.35 గంటలకు మిరుదొడ్డిలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు.అనంతరం 3.30కి తొగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చేరుకొని మల్లన్నసాగర్ నీటిని విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.
భారీ బందోబస్తు
దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఏసీపీ మధు ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment