మీర్పుర్‌ పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ | Mirpur pitch receives unsatisfactory rating after second Bangladesh-New Zealand Test - Sakshi
Sakshi News home page

BAN VS NZ 2nd Test: మీర్పుర్‌ పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ

Published Tue, Dec 12 2023 6:37 PM | Last Updated on Tue, Dec 12 2023 7:09 PM

Mirpur Pitch Between New Zealand And Bangladesh Received An Unsatisfactory Rating With A Demerit Point - Sakshi

మీర్పుర్‌ వేదికగా బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇటీవల ముగిసిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆసక్తికర రూలింగ్‌ ఇచ్చింది. మీర్పుర్‌ పిచ్‌ (షేర్‌ ఏ బంగ్లా స్టేడియం, ఢాకా) అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల పిచ్‌ కాదని ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పిచ్‌ నాసిరకంగా తయారు చేయబడిందని, పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్‌ అయ్యిందని, దీని వల్ల ఇరు జట్ల బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మ్యాచ్‌ రిఫరి డేవిడ్‌ బూన్‌ తన నివేదికలో పేర్కొన్నాడు.

ప్రమాదకరమైన పిచ్‌ను తయారు చేసినందుకుగాను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు అక్షింతలు వేసిన ఐసీసీ.. మీర్పుర్‌ పిచ్‌కు ఓ డీమెరిట్‌ పాయింట్‌ కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రిఫరి బూన్‌ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా మీర్పుర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. బ్యాటర్లకు ఏమాత్రం సహకరించని మీర్పుర్‌ పిచ్‌పై కివీస్‌ బౌలర్లు ఒకింత లబ్ది పొందారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172, రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు ఆలౌట్‌ కాగా.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని (180 ఆలౌట్‌) పొంది, రెండో ఇన్నింగ్స్‌లో (139/6) అతి కష్టంమీద బంగ్లా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్‌ అయినప్పటికీ స్పిన్నర్లకు అత్యధిక వికెట్లు లభించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement