మాంట్రియాల్: భారత సంతతి గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కప్‌లో అమెరికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి గోల్ఫర్‌గా సాహిత్ చరిత్రకెక్కాడు. గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో అమెరికా జట్టు... యూరోప్ దేశాల మినహా ఇతర దేశాల ఆటగాళ్లతో కూడిన రెస్ట్ ఆఫ్ వరల్డ్ జట్టుతో పోటీపడుతోంది.
రాయల్ మాంట్రియాల్ గోల్ఫ్ క్లబ్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో ఆడటం చాలా సంతోషంగా ఉందని పీజీఏ టూర్ టైటిల్ సాధించిన సాహిత్ పేర్కొన్నాడు. సాహిత్ తల్లిదండ్రులు మురళీధర్, కరుణ 1980 దశకంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. సాహిత్ కాలిఫోర్నీయాలో పుట్టి పెరిగాడు. ‘మా నాన్న భారత్ నుంచి అమెరికాకు వచ్చినప్పుడు ఇలాంటి ఒక రోజు వస్తుందని కచ్చితంగా ఊహించి ఉండడు.
ప్రెసిడెంట్స్ కప్‌లో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు ఎలా సాగాలో మా నాన్న నుంచే నేర్చుకున్నా. ప్రతిష్టాత్మక టోర్నీలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి మించి ఏం ఉంటుంది. మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తా.
కుటుంబ సభ్యుల సమక్షంలో ఆడనుండటం మరింత ఉత్సహాన్నిస్తోంది’అని సాహిత్ పేర్కొన్నాడు. 1994 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు 14 ఎడిషన్‌లు జరిగాయి. అందులో 12 సార్లు గెలిచిన అమెరికా జట్టు ఒకసారి ఓడిపోయింది. మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment