మెగా డీఎస్సీ దగా | - | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీ దగా

Published Wed, Nov 20 2024 12:27 AM | Last Updated on Wed, Nov 20 2024 12:28 AM

మెగా

మెగా డీఎస్సీ దగా

● తొలి సంతకం.. మోసం

నిరుద్యోగులను ఊరించిన మెగా డీఎస్సీ చివరికి దగా డీఎస్సీగా మారింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చే ఏడాది మే నెల తర్వాత అయినా ఉండే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల ప్రచారం నమ్మి మరోసారి ఉద్యోగార్థులు మోసపోయారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం తొలి సంతకం చేసి మోసం చేశారు. వేలకు వేలు ఖర్చులు పెట్టుకుని.. నెలల తరబడి కోచింగ్‌ తీసుకుంటున్న అభ్యర్థులకు ప్రభుత్వ వాయిదాల నిర్ణయాలు శాపంగా మారాయి.

నెల్లూరు (టౌన్‌): భావి ఉపాధ్యాయుల కలలు కరిగిపోతున్నాయి. డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ప్రభుత్వ పెద్దల నిర్ణయాలు, ఆదేశాలు చూస్తుంటే వచ్చే ఏడాదైనా డీఎస్సీ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఏడాదికిపైగా ఉద్యోగార్థులు వేల రూపాయలు వెచ్చించి కోచింగ్‌ తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన రోజునే డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం పెట్టిన సీఎం నోటిఫికేషన్‌ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగులను మభ్య పెట్టేందుకు హడావుడిగా టెట్‌ పరీక్షను నిర్వహించారు. పరీక్ష ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. ఇప్పటికే రెండుసార్లు తేదీలను ప్రకటించి వాయిదా వేశారు. గత ప్రభుత్వం ఫిబ్రవరిలో డీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించింది. దానికి ముందు నుంచే నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు. అయితే వచ్చే ఏడాది మే నెల నాటికి ఖాళీలు గుర్తించాలని ప్రభుత్వ పెద్దలు చెప్పడం చూస్తే.. ఆ తర్వాతనే నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఏడాదికి పైగా శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు, మరో ఆరు నెలలు ఎదురుచూడాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది.

668 పోస్టులు ఖాళీ

ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచడంతో జిల్లాలో ఖాళీ పోస్టుల సంఖ్య భారీగా తగ్గింది. జిల్లాలో 2025 మే నెల నాటికి ఏర్పడే ఖాళీలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ లెక్కన 668 పోస్టులు మాత్రమే ఖాళీ ఏర్పడే అవకాశం ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ (లాంగ్వేజీ–1)–37, లాంగ్వేజీ–17, ఎస్‌ఏ (ఇంగ్లిష్‌)–83, ఎస్‌ఏ (మ్యాథ్స్‌)–62, ఎస్‌ఏ (పీఎస్‌)–75, ఎస్‌ఏ (బీఎస్‌)–62, ఎస్‌ఏ (సోషల్‌)–102, ఎస్‌ఏ (పీఈటీ)–105, ఎస్జీటీ– 72 కలిపి మొత్తం 615 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు మున్సిపల్‌ పాఠశాలలకు సంబంధించి ఎస్‌ఏ (లాంగ్వేజీ–1)–12, లాంగ్వేజీ–2– 3, ఎస్‌ఏ (ఇంగ్లిష్‌–1, ఎస్‌ఏ (మ్యాథ్స్‌)–1, ఎస్‌ఏ (పీఎస్‌)–5, ఎస్‌ఏ (పీఈటీ)–1, ఎస్జీటీ – 30 కలిపి మొత్తం 53 ఖాళీ పోస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపాల్టీల్లో కలిపి 102 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. వీటికి మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

రెండింటికి చెడ్డ రేవడిలా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది ఫిబ్రవరి, టీడీపీ ప్రభుత్వంలో అక్టోబర్‌లో టెట్‌ పరీక్ష నిర్వహించారు. రెండు టెట్‌ పరీక్షల్లో జిల్లా నుంచి సుమారు 12 వేల నుంచి 14 వేల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరంతా గత ఏడాది అక్టోబరు నుంచే డీఎస్సీ కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఒక్కో అభ్యర్థి కోచింగ్‌కు రూ.15 వేలు, వసతి, భోజన సదుపాయాలకు మరో రూ.15 వేలు కలిపి మొత్తం నెలకు రూ.30 వేల వంతున ఖర్చు చేస్తున్నారు. కోచింగ్‌ తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రైవేట్‌ పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారే. వీరంతా సెలవులు పెట్టడంతో వచ్చే అరకొర జీతాలు కోల్పోయి.. మరో వైపు కోచింగ్‌ పేరుతో భారీగా ఖర్చు పెట్టుకుంటూ రెండింటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు. ప్రభుత్వం నిర్ణయం చూస్తుంటే.. మరో ఆరు నెలల తర్వాతనే డీఎస్సీ ఉండే అవకాశం ఉంది.

నిర్వహణపై నీలినీడలు

డీఎస్సీ పరీక్షకు తొలుత ఈ నెల 6న నోటిఫికేషన్‌ అంటూ ప్రకటించారు. ఆ తర్వాత వాయిదా వేసి 10న నిర్వహిస్తామని తెలిపారు. అయినా నోటిఫికేషన్‌ను ప్రకటించకపోవడంతో అటు ప్రతిపక్ష నాయకులు, అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాష్ట్ర పాలకులు మాట మార్చారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ను నియమించామని, రెండు నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించామని చెబుతున్నారు. ఆ నివేదికై నా రెండు నెలల్లో ఇస్తారని గ్యారెంటీ లేదు. గతంలో ఇలాంటి నివేదికలను నెలల పాటు వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక వేళ నివేదిక ఇచ్చినా ఎస్సీ వర్గీకరణపై అడుగు పడుతుందా? అనే అనుమానం తలెత్తుతోంది. ఒకవేళ నోటిఫికేషన్‌ విడుదల చేసినా ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రాలేదంటూ వాయిదా వేస్తారా? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. వర్గీకరణపై పలు వర్గాలు కోర్టుకు పోయే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. వీటన్నింటిని ముందునుంచే గుర్తించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ అంటూ అందరిని మోసం చేశారని అభ్యర్థులు మండి పడుతున్నారు.

వచ్చే ఏడాది మే నాటికి ఖాళీలు

గుర్తించాలని ఆదేశాలు

జిల్లాలో 668 ఖాళీ పోస్టుల గుర్తింపు

వీటిల్లో ఎస్జీటీలు 72 మాత్రమే

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇప్పటికే

రెండు సార్లు వాయిదా

వ్యయ ప్రయాసలు పడి కోచింగ్‌

తీసుకుంటున్న అభ్యర్థులు

మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు

డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. డీఎస్సీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పటికే జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు పంపించాం. డీఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. అవి వచ్చిన వెంటనే చర్యలు చేపడతాం.

– ఆర్‌.బాలాజీరావు, డీఈఓ

అభ్యర్థులకు న్యాయం చేయాలి

డీఎస్సీ నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేసి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి. ఇప్పటికే వేలాది మంది కోచింగ్‌ తీసుకుని డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం నిరీక్షిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా న్యాయపరమైన చిక్కులు లేకుండా డీఎస్సీ పరీక్షను నిర్వహించాలని ఆశిస్తున్నాం.

– ఎం.హరిబాబు, శ్రీహర్ష కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు

No comments yet. Be the first to comment!
Add a comment
మెగా డీఎస్సీ దగా 1
1/2

మెగా డీఎస్సీ దగా

మెగా డీఎస్సీ దగా 2
2/2

మెగా డీఎస్సీ దగా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement