అర్ధరాత్రి అరాచకం
బిట్రగుంట: బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న అధికార టీడీపీ నేతలు బరితెగించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా నిర్బంధించి తప్పుడు కేసులు బనాయించేందుకు సిద్ధపడ్డారు. రైతులను భయాందోళనలకు గురి చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి వేళ పోలీసులు హద్దుమీరి ప్రవర్తించారు. ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘతోపాటు ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడిన రైతు దగుమాటి కొండయ్యను కారణాలు చెప్పకుండా అర్ధరాత్రి సమయంలో బలవంతంగా స్టేషన్‌కు తరలించి సెల్‌ఫోన్లు లాక్కొన్నారు. ఎస్సై వచ్చే వరకు స్టేషన్‌లోనే ఉండాలంటూ హుకుం జారీ చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు రాత్రి 11.30 గంటల సమయంలో పెద్ద ఎత్తున స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి కూడా హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని పోలీసులను నిలదీశారు. ఓటర్లకు డబ్బులు పంచుతుంటే పట్టుకున్నామంటూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఎస్పీ కృష్ణకాంత్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి ఒంటి గంట సమయంలో వారిని విడిచిపెట్టారు.
హైకోర్టు నుంచి ఉత్తర్వులు రావడంతో..
బోగోలు చెరువు సాగునీటి సంఘం ఓటర్ల జాబితాను అధికార పక్షం ఏకపక్షంగా సిద్ధం చేసింది. దీంతో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌కు సైతం ఆధారాలతో సహా వినతిపత్రాలు ఇచ్చినా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో రఘు రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం సాయంత్రం హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన కొద్ది గంటల్లోనే పోలీసులు రఘును, కొండయ్యను అర్ధరాత్రి స్టేషన్‌కు తరలించి, డబ్బులు పంచుతున్నారంటూ పోలీసులు చేసిన ఆరోపణ కూడా తీవ్ర వివాదానికి దారి తీసింది.
నియంతల్లా వ్యవహరిస్తున్నారు
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందో లేక నియంత పాలన నడుస్తుందో అర్థం కావడం లేదు. ఇంట్లో నిద్రపోతున్న మమ్మల్ని లేవగొట్టి స్టేషన్‌కు తీసుకురావడం, డబ్బులు పంచుతున్నారని చెప్పడం అధికార పార్టీ దుర్మార్గానికి నిదర్శనం. సాగునీటి సంఘం ఎన్నికల్లో అసలు ఎవరైనా డబ్బులు పంచుతారా? న్యాయంగా గెలవలేక కుట్రలు, కుతంత్రాలతో గెలవాలనుకోవడం దుర్మార్గం.
– మద్దిబోయిన వీరరఘు,
వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్
ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్సార్‌సీపీ
మండల కన్వీనర్, అభ్యర్థిని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
డబ్బులు పంచుతున్నారంటూ తప్పుడు కేసు పెట్టేందుకు విఫలయత్నం
పోలీసుల వైఖరిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment